బుధవారం 03 జూన్ 2020
International - Apr 17, 2020 , 14:54:47

కరోనా వీటి చావుకొచ్చింది

కరోనా వీటి చావుకొచ్చింది

కరోనా కారణంగా పనులు లేక చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితుల్లో చాలామంది గ్రామీణవాసులు అత్యంత అరుదైన పక్షులు, జంతువులను వేటాడి చంపటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నది. ఇండియాతోపాటు తూర్పు ఆసియాదేశాల్లోని అరుదైన పులులు, ఖడ్గమృగాలు, పక్షులు ఇప్పుడు వేటగాళ్ల బారినపడి పూర్తిగా అంతరించే ప్రమాదముందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కరోనా కారణంగా భద్రతా అధికారులు కూడా వేరే పనుల్లో మునిగి ఉండటంతో వేటగాళ్ల పని తేలికవుతున్నదని వైల్డ్‌లైఫ్‌ కన్సర్వేషన్‌ చారిటీ అనే స్వచ్చంద సంస్థ తెలిపింది.

కాంబోడియలో కనిపించే ఒకరకమైన కొంగజాతి ఇప్పుడు అంతరించే పక్షుల జాబితాలో ఉంది. కరోనా కారణంగా ఈ పక్షుల వేట మరింత పెరిగింది. పల్లెల్లోని జనానికి ఆదాయమార్గాలు మూసుకుపోవటంతో ఈ పక్షులను వేటాడి మాంసాన్ని విక్రయిస్తున్నారు. విషప్రయోగం ద్వారా ఇటీవల ఈ పక్షులను భారీ ఎత్తున చంపేశారు. ఇవి కంబోడియా జాతీయ పక్షులు కూడా. ఈ పక్షులు భూమిమీద ఒకశాతం మాత్రమే మిగిలి ఉండటంతో పక్షి ప్రేమికులు వీటి వేటపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నిజానికి ఈ పక్షులు మామూలు సమయంలో వేలంమంది పర్యాటకులను ఆకర్శిస్తుంటాయి. తద్వారా స్థానికులకు మంచి సంపాదన ఉంటుంది. కానీ విచక్షణారహితమైన వేటవల్ల వారి ఉపాధికి కూడా ముప్పు ఏర్పడింది.

భారత్‌లోని రక్షిత అడవుల్లో పులుల వేటకూడా పెరిగినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా ఆసియా, ఆఫ్రికాల్లో అరుదైన ఖడ్గమృగాల వేటకూడా 50శాతం పెరిగిందని ఆ చారిటీ సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది.


logo