బుధవారం 03 జూన్ 2020
International - Apr 16, 2020 , 16:49:55

నడుస్తూనే 600 కోట్లు సంపాదించాడు

నడుస్తూనే 600 కోట్లు సంపాదించాడు

కరోనాతో అతలాకుతలం అవుతున్న బ్రిటన్‌లో 99 ఏండ్ల ఓ పెద్దాయన అసాధారణ ఘనత సాధించాడు. బెడ్‌ఫోర్డ్‌షైర్‌లో నివాసముండే రిటైర్డ్‌ ఆర్మీ కెప్టెన్‌ టామ్‌ మూర్‌ (99) కరోనా బాధితుల వైద్యం కోసం తనవంతుగా ఏదైనా సాయం చేయాలని భావించారు. ఆయనకు రెండేండ్ల క్రితమే తుంటి ఎముక విరిగిపోవటంతో వికలాంగులు వాడే ఊతకర్ర సాయంతో మాత్రమే నడువగలరు. అది కూడా పది పదిహేను అగుడు దూరం మాత్రమే. కానీ ఆయన సంకల్పానికి ఆ వైకల్యం అడ్డుకాలేదు. తన నివాసం చుట్టూ 25 మీటర్ల దూరం 100 సార్లు నడవాలని నిర్ణయించారు. అలా నడుస్తూ తన మిత్రులు, సన్నిహితులకు జాతీయ హెల్త్‌ సర్వీస్‌ కోసం తోచినంత  విరాళం చేయాలని కోరాడు. ఈ నెలలోనే ఆయన తన 100వ జన్మదినం జరుపుకోనున్నారు. తన జన్మదినంలోపు 100 రౌండ్లు తిరుగుతానని శపథం చేశారు.

ఈ పని ద్వారా ఆయన 1000 పౌండ్ల వరకు ఎన్‌హెచ్‌ఎస్‌కు నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఆయన సంకల్పం మీడియా దృష్టిలో పడటంతో పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. దాంతో ఆయన బ్రిటన్‌లో ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. అంతేకాదు మూర్‌ చర్యకు ముగ్ధులైన లక్షల మంది ఆయన ప్రారంభించిన నిధుల సేకరణ ఉద్యమానికి తలోచెయ్యి వేశారు. దాంతో ఇప్పటికే రూ.614కోట్లకుపైగా (8మిలియన్‌ డాలర్లు) సమకూరాయి. తనకు ప్రమాదం జరిగిప్పుడు ఎన్‌హెచ్‌ఎస్‌ చేసిన సేవలకు కృతజ్ఞతగా ఏదో ఒకటి చేయాలనుకున్నారని మూర్‌ అల్లుడు కొలిన్‌ ఇన్‌గ్రామ్‌ తెలిపారు. ఇప్పుడు మూర్‌ 100వ జన్మదినం కోసం దేశమంతా ఎదురుచూస్తున్నది.  


logo