ఆదివారం 31 మే 2020
International - Apr 11, 2020 , 16:57:49

అమెరికాను వణికిస్తున్న మరో ప్రమాదం

అమెరికాను వణికిస్తున్న మరో ప్రమాదం

స్వయంకృతాపరాధంతో కరోనా మహమ్మారి గుప్పిట చిక్కి అమెరికా విలవిలలాడుతున్నది. శనివారం ఒక్కరోజే ఆ దేశంలో 2000 మంది కోవిడ్‌ వైరస్‌తో మరణించారు. ఏ దేశంలో అయినా ఒక్కరోజులో ఇంతమంది మరణించటం ఇదే మొదటిసారి. ఈ విలయం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీనికి తోడు అమెరికన్లను ఇప్పుడు మరో ప్రకృతి విపత్తు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. అదే హరికేన్‌

అమెరికా తూర్పుతీరాన్ని ప్రతి ఏటా అత్యంత శక్తిమంతమైన హరికేన్లు కుదిపేస్తుంటాయి. సాధారణంగా ఈ అట్లాంటిక్‌ హరికేన్లు జూన్‌ ప్రారంభం నుంచి మొదలవుతాయి. అయితే ఈసారి హరికేన్లు ముందుగానే ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అమెరికా విపత్తు నిర్వహణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. అసలే కరోనాతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్న జనానికి హరికేన్ల భయం నిద్రపట్టనివ్వటం లేదు. ఈ ఏడాది కనీసం 4 శక్తిమంతమైన హరికేన్లు అమెరికాపై విరుచుకుపడవచ్చని ఫ్లోరిడా డివిజన్‌ అత్యవసర పరిస్థితి నిర్వహణలో అపార అనుభవం ఉన్న బ్రయాన్‌ కూన్‌ అంటున్నారు.

సాధారణంగా అమెరికాను తాకే హరికేన్లలో అత్యధికశాతం ఫ్లోరిడానే తాకుతాయి. ఈ హరికేన్ల సమయంలో గాలి గంటకు కనీసం 180కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడుతుంది. ఒక్కోసారి లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. ఇప్పుడు కోవిడ్‌తోపాటు హరికేన్లు కూడా విరుచుకుపడితే జరిగే నష్టాన్ని ఊహించలేమని కూన్‌ ఆందోళన వ్యక్తంచేశారు.

హరికేన్ల సమయంలో కొద్దిరోజులపాటు ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చినప్పుడు వారివద్ద అత్యవసరాలకు వాడుకొనేందుకు సరిపడినంత డబ్బు ఉండాలి. ఇండ్లు, ఇతర వస్తువులు పాడైతే బాగుచేయించుకోవటానికి కూడా సొమ్ము కావాలి. కానీ కరోనాను అడ్డుకొనేందుకు లాక్‌డౌన్‌ ప్రకటించటంతో   లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు వేల కుటుంబాలకు రోజు గడవటమే కష్టంగా ఉంది. ఈ సమయంలో హరికేన్లు కనుక సంభవిస్తే కోలుకోలేని విధంగా దెబ్బతింటారని ఫోరిడా సెనేటర్లు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ఫెడరల్‌ ప్రభుత్వం ఒక మెకానిజంను రూపొందించాలని కోరారు. ఫ్లోరిడా గవర్నర్‌ రిక్‌ డే శాంటిస్‌ మాత్రం ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 


logo