శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 11, 2020 , 10:57:50

చైనాపై నిప్పులు కక్కిన ట్రంప్

చైనాపై నిప్పులు కక్కిన ట్రంప్

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై నిప్పులు కక్కారు. చైనా అభివృద్ధి చెందుతున్న దేశమైతే అమెరికాను కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణించాలని అంటున్నారు. అమెరికాను అడ్డుపెట్టుకుని ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరిన చైనా ఎంతో లబ్ధి పొందిందని అన్నారు. శుక్రవారం వైట్ హౌస్ లో రోజువారీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అభివృద్ధి చెందుతున్న దేశమనే సాకుతో బోలెడు ప్రయోజనాలు పొందుతున్నాయని విసుక్కున్నారు. ఇండియా కూడా అభివృద్ధి చెందుతున్న దేశమేనట. అమెరికా మాత్రం బోలెడు అభివృద్ధి చెందిన దేశమట. మేమూ బోలెడు అభివృద్ధి చెందాల్సి ఉంది - అని ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికా సాయంతో డబ్ల్యూటీవోలో చేరిన తర్వాతనే చైనా ఆర్థికవ్యవస్థ పుంజుకోవడం మొదలైందని అన్నారు. ఏళ్లతరబడి ఎదుగూబొదుగూ లేకుండా ఉన్న చైనా ఆర్థికవ్యవస్థ డబ్ల్యూటీవోలో చేరిన తర్వాతే ఒక్కసారిగా రాకెట్‌లా పైకి లేచిందని అన్నారు. అందుకు అందరినీ వాడుకున్నారని దుయ్యబట్టారు. అయినా చైనాను తాను ఏమీ అనడం లేదని, గతంలో ఇక్కడున్నవారు అదంతా జరగనిచ్చారని అంటూ ఇదివరకటి అధ్యక్షులను పరోక్షంగా విమర్శించారు. చైనా డబ్య్లూటీవోలో చేరడం, అదీ ఆపరిస్తితుల్లో చేరడం అనేది అమెరికాకు దుర్దినమని అన్నారు. చాన్నాళ్లు చైనా అమెరికాను వాడుకుని దండుకున్నదని, తాను (ట్రంప్) వచ్చిన తర్వాత చైనా నుంచి 25 శాతం (టారిఫ్) ముక్కుపిండి వసూలు చేస్తున్నామని వివరించారు. అయితే అన్ని దేశాలూ చైనాలాంటివి కావని అన్నారు.


logo