సోమవారం 01 జూన్ 2020
International - Apr 11, 2020 , 10:45:35

నేరాలు తగ్గించిన కరోనా

నేరాలు తగ్గించిన కరోనా

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వేలమందిని బలితీసుకుంటున్నది. అయితే కొన్ని విషయాల్లో దీనివల్ల తాత్కాలికంగానైనా మంచే జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా మహానగరాల్లో వాయుకాలుష్యం తగ్గింది. భారీ గనుల్లో పేలుళ్లు ఆగిపోవటంతో భూమిలో కంపనాలు తగ్గాయి. మరోముఖ్యమైన విషయం చాలా దేశాల్లో నేరాల సంఖ్య తగ్గింది. రెండు అమెరికా ఖండాల్లో మాఫియా ముఠాలు ఏకంగా సమాంతర ప్రభుత్వాలనే నడిపిస్తుంటాయి. వీటికి తోడు అమెరికాలాంటి దేశాల్లో చిన్న గొడవ జరిగినా ముందుగా తుపాకులే మాట్లాడుతాయి. అలాంటి నేరాలు కూడా చాలావరకు తగ్గాయని తాజా నివేదికలు తెలుపుతున్నాయి.

అమెరికాలో హింస ఎక్కువగా ఉండే నగరం చికాగో. ఈ నగరంలో డ్రగ్‌ మాఫియా చేసే అరాచకాలే ఎక్కువ. కరోనా కారణంగా నగరం మొత్తం లాక్‌డౌన్‌ ప్రకటించటంతో ఇక్కడ నేరాల రేటు ఏకంగా 42శాతం తగ్గిందని తాజా గణాంకాలు తెల్పుతున్నాయి. అమెరికాకు వాణిజ్య రాజధాని అయిన న్యూయార్క్‌ నగరంలో నేరాల రేటు 1990 దశకం నాటికి పడిపోయింది. ఆ దేశ చరిత్రలో నేరాల రేటు ఇంత దిగువకు పడిపోవటం ఇదే మొదటిసారి.

డ్రగ్‌ మాఫియాలకు పుట్టినిల్లు లాంటి లాటిన్‌ అమెరికా దేశాల్లో హత్యలు, దాడులు, దౌర్జన్యాలు గత రెండుమూడు దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత దిగువకు పడిపోయాయి. ఎల్‌ సాల్వెడార్‌లో గతంలోలాగా తమమీద ఎవరూ దాడులు చేయటంలేదని  ఎడ్వార్డో పెర్డోమో అనే ఓ భవన నిర్మాణ కార్మికుడు సంతోషం వ్యక్తంచేశారు.  మాఫియా ముఠా సభ్యులు వైరస్‌కు భయపడి బయటకు రావటంలేదని తెలిపారు. ఈ దేశంలో మార్చికి ముందు రోజుకు సగటున 600 మంది హత్యకు గురయ్యేవారు. ఇప్పుడు ఇది రోజుకు రెండుకు పడిపోవటం గమనార్హం. 


logo