బుధవారం 27 మే 2020
International - Apr 08, 2020 , 12:14:03

అమెరికా, చైనా రాజీ.. ఇక ఆ మాటలు వాడరట

అమెరికా, చైనా రాజీ.. ఇక ఆ మాటలు వాడరట

హైదరాబాద్: రెండు ప్రపంచ శక్తులు అవగాహనకు వచ్చాయి. పాతవైరాలు పాతిపెట్టాయి. దేని విషయంలో అంటారా? కరోనా విషయంలో. మీరు పెంచారు అంటే మీరు పంచారు అంటూ తగవులాడుకున్న రెండు దేశాలు ఆ ధోరణి వదులుకోవాలని తీర్మానించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంక ఎంతమాత్రం చైనా వైరస్ అనబోరు. మార్చి 26న ట్రంప్ చైనా అద్యక్షుడు జీ జిన్‌పింగ్ నుంచి అందుకున్న ఓ టెలిఫోన్ కాల్‌తో అంతా సమసిపోయిందట. జీ-20లో వూహాన్ వైరస్ అనాలని పట్టుబట్టిన అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో మాటమార్చారు. మంగళవారం ఓ మీడియా సమావేశంలో చైనా వైరస్ అనే పిలుపు గురించి అడిగినప్పుడు ఆయన - ఇది విశ్వమహమ్మారి.. ప్రపంచ దేశాలు అన్నీ కలిసి దీనిని ఎదుర్కోవాలి అని సమాధానం ఇచ్చారు. అమెరికా నేతలు పదేపదే చైనా వైరస్, వూహాన్ వైరస్ అనే మాటలు ఉపయోగించడం వల్లే ఈ వివాదం మొదలైంది. అసలు ఏ ఒక్క జాతిని కించపర్చే విధంగా మాటలు వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినా అమెరికా పట్టించుకోలేదు. దాంతో చైనా ఎదురు దాడికి దిగింది. అమెరికా సైనికులే వూహాన్‌లో వైరస్‌ను తెచ్చి వదిలిపెట్టారని ఆరోపించింది. అలాఅలా రెండు దేశాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలోనే ఇప్పుడు రాజీ కుదిరిందన్నమాట.


logo