బుధవారం 03 జూన్ 2020
International - Mar 30, 2020 , 17:39:52

దుబాయ్ ఆకలి తీరుస్తున్న భారతీయుడు

దుబాయ్ ఆకలి తీరుస్తున్న భారతీయుడు

కరోనా.. ప్రపంచాన్ని స్తంభింపజేసిన మహమ్మారి. సమాజంలోని అన్ని వర్గాలను ఒకే దగ్గరకు తెచ్చి దూరం దూరంగా నిలబెట్టింది. డబ్బు లేనివాడు ఆకలితో అలమటిస్తున్నాడు. డబ్బు ఉన్నవాడు కూడా ఆకలితోనే అలమటిస్తున్నాడు. అవును మరి.. హోటల్‌ తిండికి అలవాటుపడి.. వంట చేసుకోవటం ఎలాగో తెలియనివాడికి చేతిలో డబ్బు ఉన్నా ఆకలితో అలమటించవల్సిన పరిస్థితే ఇప్పుడు. దుబాయ్‌లో అలా ఆకలితో అలమటిస్తున్న వందలమంది ఆకలి తీరుస్తున్నాడు ఓ భారతీయుడు. కరోనా భయంతో జనమంతా ఇండ్లకే పరమితమైనప్పటికీ అతడు మాత్రం ప్రాణాలకు తెగించి ఎంతో మంది ఆకలి తీరుస్తున్నాడు. ప్రపంచం గుర్తించని ఆ హీరోనే మురళి శంబంతం.

దుబాయ్‌లో మురళి గత 15 ఏండ్లుగా ఫుడ్‌డెలివరీ ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా కారణంగా యూఏఈ దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 4 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించింది. దాంతో నిత్యం రద్దీగా ఉండే దుబాయ్‌ స్తంభించిపోయింది. ఫుడ్‌ డెలివరీలకు మాత్రం ఆ దేశం అనుమతిచ్చింది. అయితే చాలామంది ఫుడ్‌డెలివరీ ఉద్యోగులు కూడా కరోనా భయంతో ఉద్యోగాలకు రావటంలేదు. దాంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు మురళి తీరికలేకుండా పనిచేస్తూనే ఉన్నాడు.

15 ఏండ్లనుంచి ఇదే పనిచేస్తున్నానని, ఇలాంటి పరిస్థితిని మాత్రం ఎప్పుడూ చూడలేదని మురళి తన అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు. తమిళనాడులోని అరియలూరు పట్టణానికి చెందిన ఆయన తన కుటుంబాన్ని పోషించుకొనేందుకు అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ ఉద్యోగం చేస్తున్నానని, అదే సమయంలో ఎంతో మంది ఆకలి తీరుస్తున్నందుకు చాలా సంతృప్తిగా ఉందని ఖలీజ్‌ టైమ్స్‌ వార్తా సంస్థకు తెలిపాడు.

‘ఈ ఉద్యోగం ఎవరో ఒకరు చేయాల్సిందే. ఆహారం అనేది అత్యవసరం కదా. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందకుండా ఎలా చేయగలం? నాలాంటివాళ్లు ఉద్యోగం చేయకుంటే ఇండ్లలో వంటచేసుకొనే అవకాశం లేనివాళ్ల ఆకలి ఎలా తీరుతుంది?’ అని మురళి ప్రశ్నించాడు. అయితే తన ఉద్యోగంలో భాగంగా రోజూ ఎంతోమందిని కలిసే మురళి కోవిడ్‌ వ్యాధి పట్ల కూడా ఎంతో అప్రమత్తంగానే ఉంటున్నాడు. నిత్యం జరిపే బతుకు పోరాటంలో అతని ఆయుధాలు మాస్కులు, గ్లోవులు మాత్రమే.

‘కోవిడ్‌-19 వ్యాధి దగ్గు తుంపిర్ల ద్వారా, ఇన్‌ఫెక్షన్‌ ఉన్న ఉపరితలాన్ని తాకడం ద్వారా సోకుతుందని నాకు తెలుసు. ఈ వ్యాధి నాకు సోకకుండా ముఖానికి మాస్క్‌, చేతులకు గ్లోవ్స్‌ వేసుకుంటాను. దాంతోపాటు నా బైక్‌ ఆపిన ప్రతిచోటా శానిటైజర్‌తో చేతులు కడుక్కుంటాను. ప్రస్తుత నా ఉద్యోగం కేవలం డబ్బుతో ముడిపడినది మాత్రమే కాదు. అతి కస్టమర్ల ఆకలికి, నమ్మకానికి సంబంధించినది’ అని వివరించాడు.  


logo