సోమవారం 30 మార్చి 2020
International - Mar 25, 2020 , 09:25:18

క‌రోనాతో బ్రాడ్‌బాండ్‌కు గిరాకీ

క‌రోనాతో బ్రాడ్‌బాండ్‌కు గిరాకీ

క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ని ప‌రిస్థితులు మారిపోతున్నాయి. ఇన్నాళ్లు ఆఫీసుల నుంచి ప‌నిచేసిన ఉద్యోగులు ఇప్ప‌డు ఇండ్ల నుంచి ప‌నిచేయాల్సి వ‌స్తున్న‌ది. దాంతో స‌మాచార మార్పిడి, క‌నెక్టివిటీ కోసం ఇంట‌ర్నెట్ వాడం పెరిగిపోతున్న‌ది. నేడు చిన్న‌స్థాయి కంపెనీల‌కు కూడా ఇంట‌ర్నెట్ వాడ‌కం త‌ప్ప‌నిస‌రి అయింది. స‌మాచారం వేగంగా చేర‌వేసేందుకు ఇదే ఏకైక సాధ‌నంగా మారింది. అయితే వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ కార్య‌క‌లాపాల‌తో కోట్ల మంది ఉద్యోగులు ఒక్క‌సారిగా ఇంట‌ర్నెట్ వాడకం పెంచ‌టంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా బ్రాడ్‌బాండ్ స‌ర్వీసుల‌పై ఒత్తిడి పెరిగింద‌ని తాజా అధ్య‌య‌నాలు పేర్కొంటున్నాయి. 

ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య‌నుంచి మార్చి మ‌ధ్య వ‌ర‌కు ఆస్ర్టేలియా, బ్రిట‌న్‌, అమెరికా త‌దిత‌ర దేశాలో్ల బ్రాడ్‌బాండ్ వాడ‌కం నాలుగు శాతం పెరిగింది.  యువ‌త‌ను విశేషంగా ఆక‌ర్శిస్తున్న వీడియోగే కేంద్రాలు కూడా మూత ప‌డ‌టంతో ల‌క్ష‌ల మంది కొత్త‌గా త‌మ ఇండ్లవ‌ద్ద‌నే బ్రాడ్‌బాండ్ క‌నెక్ష‌న్‌లు ఏర్పాటు చేసుకోవ‌టం కూడా ఇంట‌ర్నెట్ వినియోగం పెర‌గ‌టానికి ఒక కారణ‌మ‌ని దీనిపై ప‌రిశోధ‌న చేసిన ఆస్ర్టేలియాకు చెందిన డాటా కంపెనీ కేఎఎస్‌పీఆర్  నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎక్కువ మంది ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారంటే ఎక్కువ మంది హై బ్యాండ్ విడ్త్ వాడుతున్న‌ట్టేన‌ని మెల్‌బోర్న్‌లోని మోనాష్ యూనివ‌ర్సిటీకి చెందిన ఆర్దిక‌వేత్త ప్రోఫెస‌ర్ పాల్ రాష్‌కీ అభిప్రాయ‌ప‌డ్డారు. 

త‌క్కువ స‌మ‌యంలో ఇంట‌ర్నెట్ వాడ‌కం ఇంత భారీగా పెరుగుతుంద‌ని ఊహించ‌క‌పోవ‌టం వ‌ల్ల కార్పొరేట్ ఇంట‌ర్నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లతోపాటు హోమ్ ఐఎస్‌పీస్ కూడా ఇప్పుడు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌ని కంప్యూట‌ర్ సెక్యూరిటీ కంపెనీ ఎడ్‌గెస్‌కాన్ వ్య‌వ‌స్థాప‌కుడు ఇయాన్ కీరి తెలిపాడు. కెపాసిటీ మేనేజ్‌మెంట్ ప్లాన్లు, టైపిక‌ల్ యూసేజ్ ప్యాట‌ర్న్‌లు సాధార‌ణంగా ఒక క్ర‌మ ప‌ద్ధ‌తిలో ఏర్పాటు చేయ‌బ‌డి ఉంటాయ‌ని, ప్ర‌స్తుతం అవ‌న్నీ మారిపోయాయ‌ని వెల్ల‌డించారు. కుటుంబాలు మొత్తం ఇండ్ల‌కే ప‌రిమితం కావ‌టంతో నెట్‌ఫ్లిక్స్‌, అమేజాన్ వీడియోస్ లాంటి వీడియో కంటెంట్ యాప్‌ల వినియోగం పెర‌గ‌టం కూడా ఇంట‌ర్నెట్ వాడ‌కం పెర‌గ‌టానికి ఒక కార‌ణ‌మ‌ని తెలిపారు. 


logo