శుక్రవారం 10 ఏప్రిల్ 2020
International - Mar 24, 2020 , 16:15:00

నిద్ర ఎంత ప‌నిచేసింది

నిద్ర ఎంత ప‌నిచేసింది

క‌రోనా వైర‌స్ భ‌యంతో జీవితాలు అత‌లాకుత‌లం అవుతున్నాయి. చిన్న పొర‌పాటు కూడా జీవితాన్ని త‌ల్ల‌కిందులు చేస్తున్న‌ది. యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఉంటున్న ఓ భార‌తీయుడు నిద్ర‌ను ఆపుకోలేక చిక్కుల్లో ప‌డ్డాడు. పుణెకు చెందిన అరున్‌సింగ్ అనే వ్య‌క్తి కొంత కాలంగా యూఏఈలో ఉంటున్నాడు. క‌రోనా నేప‌థ్యంలో ఇండియా వ‌చ్చేందుకు గ‌త ఆదివారం యూఏఈ విమానాశ్ర‌యానికి చేరుకున్నాడు. క‌రోనాతో దేశాల‌న్నీ అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను నిలిపివేయ‌టంతో యూఏఈ నుంచి ఇండియాకు రావాల్సిన చివ‌రి విమానంలో అత‌డు టికెట్ బుక్ చేసుకున్నాడు. 

తీరా విమానం ఇండియాకు బ‌య‌లుదేరే స‌మ‌యానికి అత‌డు విమానాశ్ర‌యంలోని వెయిటింగ్ రూంలో నిద్ర‌పోయాడు. దాంతో విమానం బ‌య‌లుదేరేముందు ఇచ్చే ఫైన‌ల్ కాల్ అత‌డికి విన‌ప‌డ‌లేదు. మెల‌కువ వ‌చ్చాక అధికారుల‌ను సంప్ర‌దించ‌గా విమానం వెళ్లిపోయింద‌ని చెప్పారు. ఇక ఇండియాకు అదే చివ‌రి విమానం కావ‌టంతో యూఏఈలో తాను ఉంటున్న ఇంటికైనా వెళ్దామంటే వీళ్లేద‌ని అధికారులు తెగేసి చెప్పార‌ట‌. అత‌ని తాత్కాలిక వీసా కూడా ర‌ద్దు కావ‌టంతో అక్క‌డ ఉండేందుకు అనుమ‌తించ‌టం లేద‌ని స్ప‌ష్టం చేశారు. దాంతో మూడు రోజులుగా అరున్‌సింగ్ విమానాశ్ర‌యంలోనే ఉంటున్నాడ‌ని గ‌ల్ఫ్ న్యూస్ వార్తా సంస్థ తెలిపింది. దుబాయ్ లోని భార‌తీయ కాన్సులేట్‌ను సంప్ర‌దించినా ఎలాంటి స‌మాధానం రాలేద‌ని అరున్‌సింగ్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాడు.   


logo