మంగళవారం 07 ఏప్రిల్ 2020
International - Mar 23, 2020 , 12:19:01

చైనా క‌న్నా ముందే ఇట‌లీలో క‌రోనా విజృంభ‌ణ‌..!

చైనా క‌న్నా ముందే ఇట‌లీలో క‌రోనా విజృంభ‌ణ‌..!

హైద‌రాబాద్‌:  కరోనా వైర‌స్ ఎక్క‌డ పుట్టిందో ఇంకా స్ప‌ష్టంగా తెలియ‌దు. కానీ ఆ వైర‌స్ చైనాలోని వుహాన్ న‌గ‌రాన్ని అత‌లాకుత‌లం చేసింది. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ఆ న‌గ‌రంలో క‌రోనా ల‌క్ష‌ణాల‌తో మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం మొద‌ల‌య్యాయి. ఆ వైర‌స్ వ‌ల్ల ఇప్పుడు ఇట‌లీలో ఎక్కువ మ‌ర‌ణాలు న‌మోదు అవుతున్నాయి. కానీ ఇట‌లీలో గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లోనే క‌రోనా ల‌క్ష‌ణాల‌తో పేషెంట్లు చ‌నిపోయిన‌ట్లు తాజాగా డాక్ట‌ర్లు చెబుతున్నారు.  ఎప్పుడూ లేన‌టువంటి కొత్త త‌రహా న్యూమోనియా ల‌క్ష‌ణాలు .. ఇట‌లీలో గ‌త న‌వంబ‌ర్‌లోనే క‌నిపించిన‌ట్లు ఆ దేశ వైద్య నిపుణుడు గుసెప్పీ రెమూజీ తెలిపారు.  మారియో నేగ్రీ ఇన్స్‌టిట్యూట్ ఫ‌ర్ ఫార్మ‌కోలాజిక‌ల్ రీచ‌ర్చ్ సంస్థ‌లో డైర‌క్ట‌ర్‌గా ఆయ‌న ప‌నిచేస్తున్నారు. 

ఇట‌లీలో గుర్తించిన న్యూమోనియా ల‌క్ష‌ణాలు సాధార‌ణ‌మైన‌వి కావు అని, గ‌తంలో ఎప్పుడూ అలాంటి న్యూమోనియా ల‌క్ష‌ణాల‌ను తాము గుర్తించ‌లేద‌ని రెమూజీ అన్నారు.  చైనాలో వైర‌స్ విజృంభించ‌క ముందే ఇట‌లీలో ఈ ఛాయ‌లు క‌నిపించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. యురోపియ‌న్ దేశం ఇట‌లీలో ఇప్ప‌టివ‌ర‌కు కోవిడ్‌19 వ‌ల్ల 4825 మంది మ‌ర‌ణించారు.  న్యూమోనియా ల‌క్ష‌ణాలు చాలా విల‌క్ష‌ణంగా ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు తేల్చారు.  వృద్ధుల్లో న్యూమోనియా మ‌రీ విస్తృతంగా ఉన్న‌ట్లు గ‌త ఏడాది డిసెంబ‌ర్‌, న‌వంబ‌ర్ నెల‌ల్లో గుర్తించిన‌ట్లు రెమూజీ తెలిపారు.  చైనా క‌న్నా ముందే ఇట‌లీలోని లాంబార్డీ ప్రాంతంలో ఈ వైర‌స్ భీక‌ర న‌ష్టాన్ని క‌లిగించిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. 

మ‌రోవైపు క‌రోనా వైర‌స్‌ను చైనీస్ వైర‌స్ అంటూ అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఆరోపిస్తున్నారు.  చైనీయులు మాత్రం ఆ వైర‌స్‌ను అమెరికానే వ‌దిలి వెళ్లిందంటున్నారు.  ఆ వైర‌స్ పాథోజెన్‌ను చైనాలోనే తొలిసారి గుర్తించినా, దాని పుట్టుపూర్వోత్త‌రాలు త‌మ‌కు తెలియ‌ద‌ని డ్రాగ‌న్ దేశ శ్వాస‌కోస నిపుణుడు జాంగ్ నాన్‌షాన్ తెలిపారు. వైర‌స్‌ను ఇట‌లీ డాక్ట‌ర్లు ఇప్పుడు గుర్తించినా.. అది అక్క‌డి ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండానే వ్యాప్తి చెందిన‌ట్లు రెమూజీ అన్నారు.  చైనాలో వైర‌స్ 81 వేల మందికి సోక‌గా, 3261 మంది మ‌ర‌ణించారు. ఇట‌లీలో 53వేల మందికి సోకితే, ఇప్ప‌టికే 4825 మంది మృత్యువాత‌ప‌డ్డారు.logo