గురువారం 09 ఏప్రిల్ 2020
International - Feb 07, 2020 , 01:30:12

అభిశంసన గట్టెక్కిన ట్రంప్‌!

అభిశంసన గట్టెక్కిన ట్రంప్‌!
  • ఎన్నికల ముంగిట అమెరికా అధ్యక్షుడికి భారీ ఊరట
  • US President Donald Trump unleashes fury at impeachment enemies
  • 52-48 ఓట్ల తేడాతో సెనెట్‌లో వీగిపోయిన అభియోగం

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 6: తనపై వచ్చిన అభిశంసన అభియోగాల నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు విముక్తి లభించింది. అధికార రిపబ్లికన్‌ పార్టీ ఆధిక్యంలో ఉన్న సెనెట్‌.. ట్రంప్‌పై వచ్చిన రెండు అభియోగాల్ని తోసిపుచ్చింది. ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగం 52-48 ఓట్ల తేడాతో వీగిపోగా.. అమెరికన్‌ కాంగ్రెస్‌ విధులకు ఆటంకం కలిగించారనే మరో అభియోగం 53-47 ఓట్ల తేడాతో వీగిపోయింది. దీంతో రానున్న నవంబర్‌లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధికార రిపబ్లికన్‌ పార్టీకి భారీ ఊరట లభించినట్లయింది. అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘నిజాయితీలేని కొందరు అవినీతిపరులు వేసిన అభాండాలతో(అభిశంసన అభియోగాలతో) ఓ భయంకరమైన అగ్ని పరీక్షను ఎదుర్కొన్నా. మా ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. దేశ ప్రజల్ని తీవ్రంగా గాయపర్చారు’ అని అన్నారు. తనకు వ్యతిరేకంగా ఓటేసిన రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ మిట్‌ రోమ్నీ గురించి మాట్లాడుతూ.. ఒక తప్పుడు విషయాన్ని సమర్థించుకోవడానికి తమ నమ్మకాన్ని పణంగా పెట్టే వారంటే తనకు ఇష్టం లేదని ట్రంప్‌ తెలిపారు. 


సిగ్గుమాలిన ప్రవర్తన

‘డెమోక్రాట్ల సిగ్గుమాలిన ప్రవర్తన బయటపడింది. అమెరికన్‌ ప్రజల ప్రగతి కోసం అధ్యక్షుడు గతంలోలాగే ఇకపై కూడా కృషి చేస్తారు’ అని శ్వేతసౌధం పేర్కొంది. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు డెమోక్రటిక్‌ నేత జో బిడెన్‌ నుంచి గట్టి పోటీ ఉండటంతో ఆయనను దెబ్బకొట్టేందుకు ట్రంప్‌ ఉక్రెయిన్‌ సాయం తీసుకోవాలని ప్రయత్నించిట్లు అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో గతేడాది డిసెంబరు 18న డెమోక్రాట్లు ఆధిక్యంలో ఉన్న ప్రతినిధుల సభ ట్రంప్‌పై మోపినఅభిశంసన తీర్మానాన్ని ఆమోదించగా, అధికార రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు ఆధిక్యంలో ఉన్న సెనెట్‌లో వీగిపోయింది. 
logo