బుధవారం 03 మార్చి 2021
International - Jan 18, 2021 , 00:55:22

జో టీమ్‌లో 20 మంది ఇండియన్‌ అమెరికన్లకు చోటు

జో టీమ్‌లో 20 మంది ఇండియన్‌ అమెరికన్లకు చోటు

  • వీరిలో 13 మంది మహిళామణులే
  • ఈ స్థాయిలో పదవులు దక్కడం తొలిసారి

వాషింగ్టన్‌, జనవరి 17: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ తన బృందంలో 20 మంది భారతీయ అమెరికన్లకు కీలక పదవులు కల్పించారు. వీరిలో 13 మంది మహిళలే. అమెరికా జనాభాలో కేవలం ఒక శాతం మాత్రమే ఉన్న భారతీయ అమెరికన్లకు ప్రభుత్వ యంత్రాంగంలో ఈ స్థాయిలో పదవులు లభించటం విశేషం. అందులోనూ శక్తిమంతమైన వైట్‌హౌజ్‌లో 17 మందికి చోటు దక్కటం మనవారి ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నది. అమెరికాకు 46వ అధ్యక్షుడిగా ఈ నెల 20న జో బైడెన్‌ ప్రమాణం చేయనున్నారు. భారతీయ మూలాలున్న కమలాహ్యారిస్‌ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రమాణస్వీకారానికి ముందే ఇంతమంది భారతీయ అమెరికన్లకు అధ్యక్ష బృందంలో చోటు దక్కటం ఇదే తొలిసారి. రానున్న రోజుల్లో మరింత మంది భారతీయ అమెరికన్లకు పదవులు దక్కే అవకాశం ఉన్నది. 

బడ్జెట్‌ చీఫ్‌గా నీరా టాండన్‌

అత్యంత కీలకమైన వైట్‌హౌజ్‌ మేనేజ్‌మెంట్‌, బడ్జెట్‌ డైరెక్టర్‌గా నీరా టాండన్‌ను బైడెన్‌ నియమించారు. యూఎస్‌ సర్జన్‌ జనరల్‌గా డాక్టర్‌ వివేక్‌ మూర్తి, అసోసియేట్‌ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా, ‘స్టేట్‌ ఫర్‌ సివిలియన్‌ సెక్యూరిటీ, డెమోక్రసీ, హ్యూమన్‌ రైట్స్‌' అండర్‌ సెక్రటరీగా ఉజ్రా జెయా నియమితులయ్యారు. బైడెన్‌ సతీమణి, అమెరికాకు కాబోయే ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు పాలసీ అడ్వైజర్‌గా మాలా అడిగా, డిజిటల్‌ డైరెక్టర్‌గా గరిమా వర్మను నియమించారు. వైట్‌హౌజ్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా సబ్రినా సింగ్‌ నామినేట్‌ అయ్యారు. తొలిసారిగా, కశ్మీర్‌ మూలాలున్న ఇద్దరు ఇండియన్‌ అమెరికన్లు బైడెన్‌ బృందంలో చోటు దక్కించుకున్నారు. వైట్‌హౌజ్‌ డిజిటల్‌ స్ట్రాటజీ పార్ట్‌నర్‌షిప్‌ మేనేజర్‌గా అయేషా షా నియమితులు కాగా, జాతీయ ఆర్థిక మండలి డిప్యూటీ డైరెక్టర్‌గా సమీరా ఫాజిలీ నామినేట్‌ అయ్యారు.  



స్పీచ్‌రైటింగ్‌ డైరెక్టర్‌గా వినయ్‌ రెడ్డి

ఎన్నో ఏండ్లుగా తనతో కలిసి సాగుతున్న వినయ్‌రెడ్డికి బైడెన్‌ కీలక పదవి అప్పగించారు. స్పీచ్‌రైటింగ్‌ డైరెక్టర్‌గా ఆయనను నియమించారు. అసిస్టెంట్‌ ప్రెస్‌ సెక్రటరీగా వేదాంత్‌ పాటిల్‌ను, ప్రెసిడెన్సియల్‌ పర్సనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా గౌతమ్‌ రాఘవన్‌ను నామినేట్‌ చేశారు. కీలకమైన నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌లో ముగ్గురికి, వైట్‌హౌజ్‌ కౌన్సిల్‌లో ఇద్దరికి చోటు లభించింది. కొవిడ్‌ టెస్టింగ్‌ పాలసీ అడ్వైజర్‌గా విదుర్‌ శర్మను నామినేట్‌ చేసిన బైడెన్‌.. ైక్లెమేట్‌ పాలసీ సీనియర్‌ అడ్వైజర్‌గా సోనియా అగర్వాల్‌ను నియమించారు.



ట్రంప్‌ ఖాతాపై వేటు.. తగ్గిన దుష్ప్రచారం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాపై నిషేధం విధించటంతో ఎన్నికల మోసంపై ఆన్‌లైన్‌లో జరుగుతున్న దుష్ప్రచారం 70శాతం  తగ్గిందని తాజా అధ్యయనంలో తేలింది. 

అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేయనున్న బైడెన్‌, కమలాహ్యారిస్‌లకు భారతీయ సంప్రదాయ పద్ధతిలో రంగవల్లులతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమంలో 1,800 మందికిపైగా అమెరికన్లు, భారతీయులు పాల్గొన్నారు. ప్రజలు తీర్చిదిద్దిన వేలాది రంగవల్లులతో వీడియో రూపొందించి బైడెన్‌-హ్యారిస్‌కు స్వాగతం పలుకనున్నారు. మరోవైపు, బైడెన్‌ ప్రమాణ కార్యక్రమం దగ్గరపడుతుండటంతో  ట్రంప్‌ మద్దతుదారులు మళ్లీ హింసాత్మక దాడులకు పాల్పడే ప్రమాదముందన్న హెచ్చరికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మన రెండు దేశాలను కలిపి ఉంచుతున్న ఇండియన్‌ అమెరికన్లతో.. అధ్యక్షుడయ్యాక కూడా నా అనుబంధం కొనసాగుతుంది. డెలావర్‌లో నా సహచరులు, సెనేట్‌లో నా సిబ్బంది, ఒబామా-బైడెన్‌ యంత్రాంగంలో అత్యధికమంది భారతీయ అమెరికన్లే ఉన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలో ఇంతమంది లేరు. ఇక నా ఫ్రెండ్‌ కమలాహ్యారిస్‌ అమెరికా చరిత్రలో ఉపాధ్యక్ష పదవిని చేపట్టబోతున్న తొలి ఇండియన్‌ అమెరికన్‌గా ఘనత సాధించబోతున్నారు.

-బైడెన్‌, అమెరికాకు కాబోయే అధ్యక్షుడు

కరోనా మహమ్మారి, ఆర్థిక మందగమనం, పర్యావరణ మార్పులు, జాతి వివక్షకు సంబంధించిన అంశాలపై  బైడెన్‌ తొలి సంతకం చేయనున్నారు.

VIDEOS

logo