మంగళవారం 24 నవంబర్ 2020
International - Nov 12, 2020 , 02:08:02

అధికార మార్పిడిని ఆపలేరు

అధికార మార్పిడిని ఆపలేరు

  • జనవరి 20 నాటికి అంతా కొలిక్కి
  • ట్రంప్‌ తీరు ఇబ్బందికరం: బైడెన్‌

వాషింగ్టన్‌, నవంబర్‌ 11: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఓటమిని అంగీకరించకపోవడం ఇబ్బందికరంగా మారిందని, అధ్యక్ష పదవి హోదాకు అది తగని చర్య అని జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. అధికార మార్పిడిని ఎవరూ ఆపలేరని స్పష్టంచేశారు. ప్రపంచాధినేతలతో తాను ఇప్పటికే మాట్లాడడం మొదలుపెట్టానని చెప్పారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే జనవరి 20 నాటికి అంతా కొలిక్కి వస్తుందని చెప్పారు. అధికార బదిలీ ప్రక్రియను తాము ఇప్పటికే ప్రారంభించామన్నారు.

బైడెన్‌ రివ్యూ టీమ్‌లో 20 మంది ఇండియన్‌ అమెరికన్లు

అధికార మార్పిడి సజావుగా సాగేలా చూసేందుకు ఉద్దేశించిన ఏజెన్సీ రివ్యూ టీమ్‌(ఏఆర్‌టీ)లలో 20 మందికిపైగా భారతీయ అమెరికన్లను బైడెన్‌ నియమించారు. వీరిలో ముగ్గురు వివిధ టీమ్‌లకు సారథ్యం వహిస్తున్నారు.

శ్వేతసౌధంలోకి మేజర్‌, చాంప్‌

ఈసారి శ్వేతసౌధంలోకి బైడెన్‌ దంపతులతోపాటు రెండు బుల్లి శునకాలు కూడా అడుగుపెట్టనున్నాయి. వారు పెంచుకుంటున్న జర్మన్‌ షెపర్డ్స్‌ జాతికి చెందిన చాంప్‌, మేజర్‌ అనే శునకాలను వారితోపాటు వైట్‌హౌస్‌కు తీసుకెళ్లనున్నారు. 

మళ్లీ ట్రంప్‌కే అధికార మార్పిడి!

ఓటమిని అంగీకరించనని మంకుపట్టు పడుతున్న అధ్యక్షుడు ట్రంప్‌కు విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో వంతపాడారు. ట్రంపే అధికారంలో కొనసాగుతారని చెప్పారు. ‘రెండో దఫా అధికారం చేపట్టబోతున్న ట్రంప్‌కు అధికార మార్పిడి సజావుగా సాగుతుంది. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన పేర్కొన్నారు. 

మళ్లీ ఓటు వేయండి: ఎరిక్‌ ట్రంప్‌ 

ఎన్నికలు ముగిసిన వారం రోజుల తర్వాత.. మళ్లీ ఓటు వేయాలంటూ ట్రంప్‌ కుమారుడు ఎరిక్‌ ట్రంప్‌ పిలుపునిచ్చారు. ‘మిన్నెసోటా.. బయటకు వచ్చి ఓటు వెయ్‌' అంటూ ఆయన ట్వీట్‌చేశారు. అనంతరం కాసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు. అయితే అప్పటికే ఆ ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది.  

ఇండియన్‌ అమెరికన్‌కు కీలక పదవి

అమెరికాలోని భారత సంతతికి చెందిన కశ్యప్‌ ప్రయోద్‌ పటేల్‌కు కీలక పదవి దక్కింది. ఆ దేశ తాత్కాలిక రక్షణ మంత్రి క్రిస్‌ మిల్లర్‌కు పటేల్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు రక్షణ మంత్రిగా పనిచేసిన మార్క్‌ ఎస్పర్‌ను ఇటీవల ట్రంప్‌ తొలిగించారు. ఆయన స్థానంలో క్రిస్‌ మిల్లర్‌ను తాత్కాలిక రక్షణ మంత్రిగా నియమించారు.