శనివారం 04 ఏప్రిల్ 2020
International - Mar 08, 2020 , 02:12:55

భారత్‌లో ‘క్యాన్సర్‌ సునామీ’

భారత్‌లో ‘క్యాన్సర్‌ సునామీ’
  • మేల్కొనకుంటే ఆరోగ్య విపత్తే
  • ప్రముఖ వైద్యుల హెచ్చరిక

వాషింగ్టన్‌: భారత్‌లో క్యాన్సర్‌ ‘సునామీ’ వేగంతో విజృంభిస్తున్నదని ప్రముఖ ప్రవాసభారతీయ వైద్యులు నోరి దత్తాత్రేయుడు, రేఖ భండారి హెచ్చరించారు. ప్రభుత్వాలు వెంటనే మేల్కొని, నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు. నోరి దత్తాత్రేయుడు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సహా ప్రముఖ రాజకీయ నేతలకు క్యాన్సర్‌ చికిత్స అందించారు. రేఖ భండారి క్యాన్సర్‌ వైద్య నిపుణులు. వారు ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. వారికి అమెరికా ప్రభుత్వం ‘ఎల్లిస్‌ ఐలాండ్‌ మెడల్‌ ఆఫ్‌ హానర్‌'ను బహూకరించింది. అవార్డు స్వీకరణ కార్యక్రమంలో  దత్తాత్రేయుడు మాట్లాడుతూ.. ‘భారత్‌లో రోజూ సగటున 1,300 మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. ఏటా కొత్తగా 12 లక్షల  కేసులు నమోదవుతున్నాయి’ అని చెప్పారు.  ప్రభుత్వాలు స్పందించి తగిన చర్యలు తీసుకోకుంటే క్యాన్సర్‌ వ్యాధి ప్రజలపై ‘సునామీ’లా విరుచుకుపడుతుందన్నారు. రేఖ భండారి మాట్లాడుతూ.. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం, చికిత్సకు కావాల్సిన మౌలిక వసతులు నెలకొల్పడం, ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం వంటి చర్యలు తీసుకోకుంటే ‘ఆరోగ్య విపత్తు’ తప్పదని హెచ్చరించారు. logo