బుధవారం 30 సెప్టెంబర్ 2020
International - Aug 05, 2020 , 09:49:36

ఏమిటీ అమోనియం నైట్రేట్‌..అంత శ‌క్తివంతంగా పేలుతుందా?

ఏమిటీ అమోనియం నైట్రేట్‌..అంత శ‌క్తివంతంగా పేలుతుందా?

హైద‌రాబాద్‌:  ప‌శ్చిమ ఆసియా దేశ‌మైన లెబ‌నాన్ రాజ‌ధాని బీర‌ట్‌లో మంగ‌ళ‌వారం శ‌క్తివంత‌మైన పేలుడు సంఘ‌ట‌న జ‌రిగిన విష‌యం తెలిసిందే.  అత్యంత భ‌యంక‌ర‌మైన పేలుడుకు కార‌ణం అమోనియం నైట్రేట్ ర‌సాయ‌నం.  సుమారు 2750 ట‌న్నులు అమోనియం నైట్రేట్ ర‌సాయ‌నం పేల‌డం వ‌ల్ల .. బీర‌ట్‌లో అంత పెద్ద ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు.  ఒక్క‌సారిగా ఆ భారీ మొత్తంలో ర‌సాయ‌నం పేలడంతో బీర‌ట్ న‌గ‌రం చిగురుటాకుల వ‌ణికిపోయింది. భారీ విస్పోట‌నం వ‌ల్ల న‌గ‌ర‌మంతా పొగ‌చూరింది.  అయితే బీర‌ట్ న‌గ‌ర ఓడ‌రేవు వ‌ద్ద దాదాపు ఆరేళ్లుగా ఓ వేర్‌హౌజ్‌లో అమోనియం నైట్రేట్‌ను స్టోర్ చేయ‌డం వ‌ల్ల ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. 

అమోనియం నైట్రేట్‌ను అనేక ర‌కాలుగా వినియోగిస్తుంటారు.  ఎక్కువ శాతం ఈ రసాయ‌నాన్ని వ్య‌వ‌సాయ ఎరువుగా వాడుతుంటారు.  ఇదే ర‌సాయ‌నాన్ని పేలుళ్లకు కూడా వినియోగిస్తారు. అమోనియం నైట్రేట్ ఎంత ప్ర‌మాద‌క‌రం అంటే.. ఒక‌వేళ ఆ ర‌సాయ‌నం వ‌ద్ద చిన్న అగ్గి ఛాయ‌లు ఉన్నా.. అది మ‌హాశ‌క్తివంతంగా పేలుతుంది.  ఈ ర‌సాయ‌నం పేలిన‌ప్పుడు.. అత్యంత ప్రాణాంత‌క‌మైన వాయువులు కూడా విడుద‌ల అవుతాయి.  అమోనియం నైట్రేట్ నుంచి విష‌పూరిత‌మైన నైట్రోజ‌న్ ఆక్సైడ్‌తో పాటు అమోనియా వాయువు కూడా రిలీజ్ అవుతుంది.  

అమోనియం నైట్రేట్ చాలా త్వ‌ర‌గా నిప్పును ఆక‌ర్షిస్తుంది. పేలుడు గుణాలు ఎక్కువ‌గా ఉన్న అమోనియం నైట్రేట్ స్టోరేజ్ విష‌యంలో చాలా క‌ఠిన నిబంధ‌న‌లు ఉన్నాయి. స్టోరేజ్ సైట్ల‌ను అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా ఉండేవిధంగా చూసుకోవాలి.  అమోనియం నైట్రేట్‌ను స్టోరేజ్ చేసిన ప్రాంతంలో ఎటువంటి డ్రైనేజీలు, పైపులు, ఇత‌ర ప్ర‌వాహ వాహ‌కాలు ఉండ‌కూడదు. ఎందుకంటే ఆ పైపుల్లో ఒక‌వేళ అమోనియం స్టోర్ అయితే అప్పుడు ప్ర‌మాద తీవ‌త్ర మ‌రింత భ‌యంక‌రంగా ఉంటుంది. 

బీర‌ట్‌లో జ‌రిగిన అమోనియం నైట్రేట్ పేలుడుకు.. అక్క‌డి ఓడ‌రేవు మొత్తం ధ్వంస‌మైంది. పేలుడు తీవ్రత ఎంత ఉందంటే.. రెండు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న షాపింగ్ మాల్‌లోనూ గాజు అద్దాలు ధ్వంసం అయ్యాయి. మంగ‌ళ‌వారం బీర‌ట్ పోర్టులో జ‌రిగిన ప్ర‌మాదంలో 78 మంది మృతిచెందార‌ని, 4 వేల మంది గాయ‌ప‌డ్డార‌ని అధ్య‌క్షుడు మైఖేల్ ఆవ‌న్ తెలిపారు.


logo