బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Feb 05, 2020 , 10:50:12

సైన్యం కోసం 2.2 ట్రిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు చేశాం: డోనాల్డ్ ట్రంప్‌

సైన్యం కోసం 2.2 ట్రిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు చేశాం:  డోనాల్డ్ ట్రంప్‌

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇవాళ ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు.  వాషింగ్ట‌న్‌లోని క్యాపిట‌ల్‌హిల్‌లో ఆయ‌న ప్ర‌సంగం కొన‌సాగింది.  దేశాధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత‌.. వేగంగా అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేశామ‌న్నారు. ఉద్యోగాల‌కు కోత విధించే అనేక  ఆంక్ష‌ల‌ను ఎత్తివేసిన‌ట్లు చెప్పారు. రికార్డు స్థాయిలో ప‌న్ను సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టామ‌న్నారు.  దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ గ‌తంలో క‌న్నా మెరుగ్గా ఉంద‌ని ట్రంప్ తెలిపారు. ప్ర‌జ‌ల ఆదాయం పెరుగుతోంద‌న్నారు. గ‌త 50 ఏళ్ల‌తో పోలిస్తే నిరుద్యోగం అత్య‌ల్పంగా ఉంద‌న్నారు.  గ‌త పాల‌కుల 8 ఏళ్ల పాల‌న‌లో సుమారు 3 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఊడిపోయాయ‌ని, కానీ త‌మ మూడేళ్ల పాల‌న స‌మ‌యంలో 30 ల‌క్ష‌ల మంది ఉద్యోగాల్లో చేరార‌న్నారు.  ప్ర‌పంచంలో అమెరికా ఇంధ‌న ఉత్ప‌త్తిలో నెంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరుకుంద‌న్నారు.  గ‌త పాల‌కుల స‌మ‌యంలో 60 వేల ఫ్యాక్ట‌రీలు మూత‌ప‌డ్డాయ‌ని, కానీ తాజాగా 12వేల కొత్త ఫ్యాక్ట‌రీల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. 

గ‌త 70 ఏళ్ల‌లో మ‌హిళ ఉద్యోగుల సంఖ్య త‌గ్గింద‌ని, కానీ త‌మ ప్ర‌భుత్వం 72 శాతం మ‌హిళ‌ల‌కు ఉద్యోగాలు ఇచ్చింద‌న్నారు.  దేశ మిలిట‌రీని పున‌ర్ నిర్మించామ‌న్నారు. అమెరికా స్వేచ్ఛ‌ను కాపాడుకునేందుకు,  సైన్యం కోసం అత్య‌ధిక స్థాయిలో 2.2 ట్ర‌లియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు ట్రంప్ తెలిపారు. అమెరికా ఉద్యోగాల‌ను కాజేస్తున్న చైనాపై నియంత్రణ తీసుకువ‌చ్చిన‌ట్లు చెప్పారు.  చైనా ఉత్ప‌త్తుల‌పై అధిక ప‌న్ను వేయ‌డం వ‌ల్ల వ్యూహాం ఫ‌లించింద‌న్నారు.  ఇప్పుడు స్వ‌దేశీ కంపెనీలు దేశం విడిచి వెళ్ల‌డం లేద‌ని ట్రంప్ తెలిపారు.  హెల్త్‌కేర్ వ్య‌వ‌స్థ‌ను కూడా ప‌టిష్టం చేసిన‌ట్లు అధ్య‌క్షుడు తెలిపారు. ఉత్త‌మ వైద్యం కోసం అయ్యే ఖ‌ర్చు భారాన్ని త‌గ్గించ‌వ‌చ్చ‌న్నారు. హెల్త్‌కేర్ ప్రీమియంల‌ను త‌గ్గించిన‌ట్లు తెలిపారు. మెడీకేర్‌, సోష‌ల్ సెక్యూర్టీని సంర‌క్షిస్తామ‌న్నారు. ఇమ్మిగ్రేష‌న్ ఆఫీసులో ప‌నిచేస్తున్న డిపోర్టేష‌న్ ఆఫీస‌ర్ల‌ను ట్రంప్ మెచ్చుకున్నారు. మెక్సికో స‌రిహ‌ద్దుతో గోడ నిర్మాణం వేగంగా కొన‌సాగుతోంద‌న్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ‌ను స్థాపించిన అల్ బ‌గ్దాదిని హ‌త‌మార్చిన‌ట్లు ట్రంప్ తెలిపారు.

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ కోసం వ‌న్ ట్రిలియ‌న్ ట్రీస్ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు ట్రంప్ చెప్పారు. గ‌త 51 ఏళ్ల‌తో పోలిస్తే తొలిసారి మెడిసిన్ ధ‌ర‌లు త‌గ్గిన‌ట్లు ఆయ‌న చెప్పారు. అత్య‌ధిక సంఖ్య‌లో జ‌న‌రిక్ మందుల‌కు ఆమోదం తెలిపామ‌న్నారు.  అమెరికా ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడుకునేందుకు.. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా యుద్ధాన్ని ఆప‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. 


logo