మంగళవారం 01 డిసెంబర్ 2020
International - Nov 01, 2020 , 15:45:47

ట్రంప్ ర్యాలీలు 18.. పెరిగిన కొవిడ్ కేసులు 30,000

ట్రంప్ ర్యాలీలు 18.. పెరిగిన కొవిడ్ కేసులు 30,000

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీల కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అదేవిధంగా మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది. ఈ మధ్య ట్రంప్‌ నిర్వహించిన దాదాపు 18 ఎన్నికల ర్యాలీల కారణంగా 30 వేల మందికి పైగా కరోనా వైరస్‌ సంక్రమణకు గురయ్యారు. 700 మందికి పైగా చనిపోయారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన అధ్యయనం.. ట్రంప్ ర్యాలీలు నిర్వహించిన కమ్యూనిటీలు భారీ మూల్యం చెల్లించుకున్నాయని వెల్లడించింది. ''ట్రంప్‌ మీ గురించి పట్టించుకోరు. తన సొంత మద్దతుదారు ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా గాలికొదిలేస్తారు.. జాగ్రత్త'' అంటూ దీనిపై స్పందించిన డెమోక్రాట్‌ అభ్యర్థి జో బిడెన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

" ది ఎఫెక్ట్‌ ఆఫ్‌ లార్జ్‌ గ్రూప్‌ మీటింగ్స్‌ ఆన్‌ ది స్ప్రెడ్‌ ఆఫ్‌ కొవిడ్‌-19: ది కేస్‌ ఆఫ్‌ ట్రంప్‌ ర్యాలీస్‌" అనే అంశంపై అధ్యయనం జరిపారు. జూన్ 20 నుంచి సెప్టెంబర్ 22 మధ్య కాలంలో డొనాల్ట్‌ ట్రంప్ నిర్వహించిన 18 ర్యాలీలను పరిశోధకులు పరిశీలించి.. "ఈ ప్రదేశాల్లో 30 వేల మందికి పైగా కొవిడ్‌-19 ధృవీకరించబడిన కేసులు వచ్చాయి. వీరిలో దాదాపు 700 మంది కంటే ఎక్కువ మంది చనిపోయినట్లు అంచనాకు వచ్చారు. వీరిలో నేరుగా ట్రంప్‌ ర్యాలీలకు రానివారు కూడా ఉన్నారు. జనసమర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొవిడ్‌ వ్యాపిస్తుందని చెప్తున్న ప్రజారోగ్య విభాగం హెచ్చరికలు, సూచనలను బలంగా సమర్థిస్తామని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రత్యేకించి మాస్కులు, నిర్ణీత దూరాలకు సంబంధించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ర్యాలీలు జరుగకపోయినట్లయితే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని  వారంటున్నారు.

ఈ అధ్యయనాన్ని శుక్రవారం విడుదల చేశారు. ఇప్పటివరకు 8.7 మిలియన్లకు పైగా అమెరికన్లు కొవిడ్‌-19 బారిన పడ్డారని, ఫలితంగా 2,25,000 మందికి పైగా మరణించారని పేర్కొన్నది. పెద్ద పెద్ద వ్యక్తిగతమైన కార్యక్రమాలు, ముఖ్యంగా పాల్గొనేవారు మాస్కులు ధరించని లేదా నిర్ణీత దూరాన్ని పాటించని పరిస్థితిలో అంటువ్యాధుల ప్రమాదం మరింతగా ఉంటుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పరిశోధకులు చెప్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల కారణంగా వైరస్‌ ఊహినంత వేగంగా వ్యాప్తి చెందుతుందని భయపడుతున్నారు. ఇలాంటి ర్యాలీలు కరోనా వైరస్‌ను నియంత్రించే ప్రయత్నాలను తీవ్రంగా బలహీనపరుస్తుందని వారు పేర్కొన్నారు.

ట్రంప్ ప్రచారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీల ప్రభావాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఈ అంశాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావడమే ముఖ్య ఉద్దేశ్యం అని పరిశోధకులు తెలిపారు. ట్రంప్ ర్యాలీలకు హాజరైనవారు కొన్నిసార్లు వేల సంఖ్యలో ఉండగా.. మరికొన్నిసార్లు పదివేల సంఖ్యలో ఉన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.