బుధవారం 02 డిసెంబర్ 2020
International - Nov 02, 2020 , 01:30:02

18 సభలు... 30 వేల కేసులు

18 సభలు... 30 వేల కేసులు

  • కరోనా వ్యాప్తి కేంద్రాలుగా ట్రంప్‌ సభలు
  • వాటివల్ల 30 వేల మందికి వైరస్‌ వ్యాప్తి
  • అందులో 700 మంది మృతి
  • స్టాన్‌ఫర్డ్‌ అధ్యయనంలో వెల్లడి

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచారం ఆయన మద్దతుదారుల చావుకొచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్‌ జూన్‌ 20 నుంచి సెప్టెంబర్‌ 22 మధ్య నిర్వహించిన సభల్లో పాల్గొన్న 30 వేల మందికి పైగా కరోనా బారినపడ్డారు. వీరిలో 700 మందికిపైగా చనిపోయారు. ప్రచార సభలు జరిగిన ప్రాంతాల్లో అధ్యయనం నిర్వహించిన స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.  పెద్దసంఖ్యలో జనం గుమికూడటం వల్ల వైరస్‌ వేగంగా వ్యాప్తి  చెందుతుందనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పారు. ఈ అధ్యయనాన్ని డెమోక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ ట్వీట్‌ చేశారు. ‘ట్రంప్‌ మిమ్మల్ని ఏ మాత్రం పట్టించుకోరు. కనీసం మద్దతుదారుల ఆరోగ్యం మీద కూడా ఆయనకు శ్రద్ధ లేదు’ అని విమర్శించారు. ఇదిలా ఉండగా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ట్రంప్‌ అన్నారు. 2016లో ఎన్నికల్లో  కంటే అధిక మెజారిటీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శనివారం పెన్సిల్వేనియాలో నాలుగు సభల్లో ఆయన ప్రసంగించారు. బిడెన్‌ అవినీతిపరుడని, ఆయన గెలిస్తే పన్నులు విపరీతంగా పెరుగుతాయని ఆరోపించారు. 

మా నాన్న పోరాటయోధుడు. ఆయన మరో నాలుగేండ్లు వైట్‌హౌజ్‌లో ఉండాలి. ట్రంప్‌ ప్రతీరోజు ప్రజల కోసమే ఆలోచించారు. పోరాడారు. ఇప్పుడు ఆయన కోసం, దేశ భవిష్యత్తు కోసం పోరాడే అవకాశం మనకు లభించింది. దీనిని సద్వినియోగం చేసుకుందాం. మన ఓట్లతో అమెరికాను ఇంతకుముందెన్నడూ లేనంత గొప్పగా నిలబెడదాం.

- ఇవాంకా ట్రంప్‌

దేశ ప్రజల మధ్య విభజన సృష్టించిన వారికి మూడు రోజుల్లో ముగింపు పలకబోతున్నాం. దేశమంతా విద్వేష జ్వాలలు రగిల్చిన వారిని మూడు రోజుల్లో గద్దె దించబోతున్నాం. ట్రంప్‌ మూటాముల్లే సర్దుకొని ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఇప్పటికే కోట్ల మంది ఓట్లు వేశారు. ఈ దేశప్రజలు ఓటు వేయకుండా ఎవరూ అడ్డుకోలేరు. 

-జో బిడెన్‌, డెమోక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి

అధ్యక్షుడు ట్రంప్‌ తన అహాన్ని సంతృప్తిపర్చుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. అతనికి దేశ ప్రజల గురించిన పట్టింపు లేదు. బిడెన్‌ నా సోదరసమానుడు. ఆయనంటే నాకు ఇష్టం. ఆయన ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తారు. ఆత్మగౌరవంతో జీవించేలా చేస్తారు. ఆయన గెలిస్తే అమెరికా చరిత్రలో మరో గొప్ప అధ్యక్షుడిగా నిలుస్తారు. బిడెన్‌, కమల వారి స్వలాభం కోసం పోరాడటం లేదు. మనకోసం పోరాడుతున్నారు.    

-బరాక్‌ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు