శనివారం 24 అక్టోబర్ 2020
International - Oct 11, 2020 , 13:10:03

థాయిలాండ్‌లో ఘోర ప్రమాదం.. 17 మంది దుర్మరణం

థాయిలాండ్‌లో ఘోర ప్రమాదం.. 17 మంది దుర్మరణం

బ్యాంకాక్‌ :  ధాయిలాండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును రైలు ఢీకొట్టడంతో 17 మంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా  29 మంది తీవ్రంగా గాయపడ్డారు. బ్యాంకాక్‌ నుంచి చా చోంగ్‌సావో ప్రావిన్స్‌లోని ఓ ఆలయంలో బౌద్ధ ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరయ్యేందు వెళ్తుండగా ఉదయం 8 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ప్రావిన్స్‌ గవర్నర్‌ మైత్రీ త్రితిలానంద్‌ తెలిపారు. రైలు ఢీకొన్న వేగానికి బస్సు నుజ్జునుజ్జయ్యింది. శిథిలాలు, మృతదేహాలు రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడ్డాయి.

బస్సు పైభాగం విరిగిపడటంతో పట్టాలపై నుంచి క్రైన్‌ సాయంతో తొలగించారు. గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. థాయిలాండ్‌లో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణం. ప్రమాదకరమైన రహదారులు, అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం, పసలేని చట్టాలే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ 2018 నివేదిక ప్రకారం అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు సంభవించే దేశాల్లో థాయిలాండ్‌ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. 2018 మార్చిలో ఈశాన్య థాయిలాండ్‌లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డు వెంట చెట్టును ఢీకొట్టడంతో 18 మంది మృతి చెందగా 12 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.logo