సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Jul 15, 2020 , 18:49:11

నిర్విరామంగా వీడియో గేమ్ ఆడాడు.. గుండెపోటుకు గురయ్యాడు..

నిర్విరామంగా వీడియో గేమ్ ఆడాడు.. గుండెపోటుకు గురయ్యాడు..

బీజింగ్ : చైనాలో 15 ఏండ్ల బాలుడు నిర్విరామంగా వీడియో గేమ్ ఆడి గుండెపోటుకు గురయ్యాడు. స్ట్రోక్ కారణంగా ఎడమ చేయి పనిచేయకుండా పోయింది. ప్రస్తుతం జియాంబిన్ దవాఖానలో వైద్యుల పర్యవేక్షణలో బాలుడు కోలుకుంటున్నాడు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనాలో లాక్డౌన్ విధించడంతో జియాబిన్ అనే 15 ఏండ్ల బాలుడు ఇంట్లోనే ఉండిపోయాడు. ఆన్ లైన్ తరగతుల నెపంతో తన గదిలెక్కి వీడియో గేమ్ ఆడేవాడు. రోజంతా వీడియోగేమ్ ఆడుతూ ఉండటం వల్ల ఒకరోజు అకస్మాత్తుగా ఇంట్లో పడిపోయాడు. దాంతో తల్లిదండ్రులు బాలుడ్ని సమీపంలోని దవాఖానకు తరలించగా.. స్ట్రోక్ వచ్చినట్లు తేల్చారు. ఎడమ చేయి పూర్తిగా పట్టుదప్పిపోతుండటం వైద్యులు గుర్తించారు. బాలుడికి గుండెపోటు వచ్చిందని, అలాగే ఎడమ చేయి పక్షవాతానికి గురైందని తేల్చారు.

రోజంతా గదిలో తలుపులు వేసుకొని చదువుకుంటున్నాడని తల్లిదండ్రులు భావించారు. అయితే దాదాపు 22 గంటలపాటు వీడియోగేమ్ ఆడుతున్నాడని తెలుసుకోలేకపోయారు. చివరకు దవాఖాన పాలవడంతో తమ తప్పును తెలుసుకుని ఇప్పుడు చింతిస్తున్నారు. 

రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటూ.. మిగతా కాలం అంతా వీడియో గేమ్ ఆడటానికి కేటాయించడంతో ఆ బాలుడు చేతితోపాటు మెదడకు రక్తం, ఆక్సీజన్ పరిమాణం తగ్గాయని, ఫలితంగా స్ట్రోక్ వచ్చిందని వైద్యులు తేల్చారు. ఇంత చిన్న వయసులో ఇది అసాధారణమైన పరిస్థితి అని న్యూరాలజిస్ట్ డాక్టర్ లీ చెప్పారు. బాలుడి ఎడమ చేతి మళ్లీ పనిచేస్తుందా అనేది చెప్పడం కష్టం అని వైద్యులు అంటున్నారు.


logo