బుధవారం 03 జూన్ 2020
International - Apr 04, 2020 , 01:10:56

స్పెయిన్‌లో 10వేల మరణాలు

స్పెయిన్‌లో 10వేల మరణాలు

-ఒక్కరోజే కరోనాతో 950 మంది మృతి 

-ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలు దాటిన కేసులు 

వాషింగ్టన్‌/బీజింగ్‌/పారిస్‌/సింగపూర్‌, ఏప్రిల్‌ 3: కరోనా కరాళనృత్యం కొనసాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి వైరస్‌ సోకగా.. మరణాల సంఖ్య 50వేలు దాటింది. దాదాపు సగానికిపైగా జనాభా ఇండ్లకే పరిమితమయ్యారు. స్పెయిన్‌లో 24 గంటల వ్యవధిలో 950 మంది మరణించారు. దీంతో ఆ దేశంలో మరణాల సంఖ్య 10వేలు దాటింది. అయితే కరోనా వల్ల హాహాకారాలు చేసిన ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లో ప్రస్తుతం కొత్త కేసులు తగ్గుముఖం పడుతుండటం కాస్త ఊరటనిచ్చే అంశం. బ్రిటన్‌లో ఒక్కరోజే 569 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారంపాటు రోజూ లక్ష మందికి పరీక్షలు నిర్వహించాలని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆదేశించారు. వైరస్‌ వల్ల గురువారం ఫ్రాన్స్‌లో 471 మంది మరణించారు. థాయ్‌లాండ్‌లో శుక్రవారం నుంచి కర్ఫ్యూ విధించారు. నైజీరియాలాంటి వంటి పేద దేశాల్లో కరోనా విజృంభిస్తే కార్చిచ్చులా మారుతుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ అధికారి ఆందోళన వ్యక్తంచేశారు. కరోనా వృద్ధులకే తొందరగా సోకుతుందన్నది తప్పు అని, యుక్తవయస్సులో ఉన్న ఎంతో మంది కూడా వైరస్‌ బారిన పడి మరణించారని గుర్తుచేశారు. కాగా, కరోనా వైరస్‌ వల్ల మరణించిన వారి కోసం ఈ నెల 4న జాతీయ సంతాప దినాన్ని పాటించనున్నట్లు చైనా ప్రకటించింది.


logo