బుధవారం 03 జూన్ 2020
International - May 19, 2020 , 17:19:04

అమెరికాలో కోటి పందులను చంపేస్తారట

అమెరికాలో కోటి పందులను చంపేస్తారట

వాషింగ్టన్: అమెరికాలో ఓ వైపు ఆకలికేకలు మిన్నంటుతుంటే మరోవైపు పెద్దసంఖ్యలో కోళ్లు, పందులను చంపేసేందుకు ఫాంహౌజ్‌లు సన్నద్ధమవుతున్నాయి. కరోనా భయంతో కబేళాలు మూసివేయడంతో ఫాంహౌజ్‌ల యజమానులు జంతువులను వదిలించుకునే పనిలో పడ్డారు. వాటిని చంపేందుకు వినియోగించే పద్ధతులపై హాహాకారాలు వ్యక్తమవుతున్నాయి. ఈసరికే కోటి కోళ్లను మంటలనార్పేందుకు ఉపయోగించే ఫోమ్‌తో ఊపిరాడకుండా చేసి చంపేశారు. కాగా సెప్టెంబర్ నాటికి కోటి పందులను చంపేస్తామని పోర్క్ ఇండస్ట్రీ ప్రకటించింది. పందులను చంపడానికి గ్యాస్, కాల్పులు, మత్తుమందు అధికంగా ఇవ్వడం, బరువైన వస్తువుతో ఒక్కసారిగా మోదడం వంటి పద్ధతులను వినియోగిస్తారట. ఇంకా అమానవీయమైన ఇతర పద్ధతులూ వినియోగించనున్నట్టు తెలుస్తున్నది. మహమ్మారి కారణంగా లాక్‌డైన్ విధించడంతో ఫుడ్ బ్యాంకుల వద్ద పదేసి మైళ్ల పొడవు క్యూలు కనిపిస్తున్నాయి. ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. కబేళాల్లో పనిచేసే కార్ముకులకు కరోనా సోకుతున్న కారణంగా చాలావాటిని మూసివేశారు. బీఫ్, పోర్క్ కబేళాల సామర్థ్యం 25శాతం, 40 శాతం తగ్గిపోయాయి. దీంతో అమెరికా మాంస ఉత్పత్తుల సరఫరా దారుణంగా దెబ్బతిన్నది. కబేళాలు తగ్గిన కారణంగా ఫాంహౌజ్‌లలో కోళ్లు, పశువుల సంఖ్య పెరిగిపోతున్నది. వాటిని మేపి నష్టం పెంచుకోవడం కన్నా చంపేసి చేతులు దులిపేసుకోవాలని యజమానులు భావిస్తున్నారు. ఆవుల్ని చంపడం ఇంకా మొదలు కాలేదు. ఎందుకంటే వాటిని పెంచడం మిగతా వాటికన్నా సులభమే. కానీ కోళ్లను ఈసరికే భారీ సంఖ్యలో చంపేయడం, పందులను చంపేందుకు భారీ ప్రణాళికలు వేసుకోవడం జరుగుతున్నది.


logo