మంగళవారం 24 నవంబర్ 2020
International - Nov 15, 2020 , 09:27:39

క‌రోనా ద‌వాఖాన‌లో అగ్నిప్ర‌మాదం.. 10 మంది మృతి

క‌రోనా ద‌వాఖాన‌లో అగ్నిప్ర‌మాదం.. 10 మంది మృతి

బుకారెస్ట్‌: రొమేనియాలోని ఓ క‌రోనా ద‌వాఖాన‌లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. దీంతో అందులో చికిత్స పొందుతున్న‌ ప‌ది మంది మృతిచెందారు. పియాట్రా నీమ్ట్ కౌంటీ ద‌వాఖానాలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో శ‌నివారం రాత్రి ఒక్కసారిగా‌ మంటలు చెలరేగాయి. క్ర‌మంగా అవి పక్క గదికి కూడా వ్యాపించాయి. దీంతో అందులో చికిత్స పొందుతున్న ప‌దిమంది రోగులు అగ్నికి ఆహుత‌య్యారు. మ‌రో ఏడుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని ఆరోగ్య‌శాఖ మంత్రి నేలు ట‌టారు తెలిపారు. వారిలో ఓ డాక్ట‌ర్ కూడా ఉన్నార‌ని, అత‌ని శ‌రీరం 40 శాతం కాలిపోయింద‌ని చెప్పారు. మెరుగైన చికిత్స‌కోసం అత‌న్ని రాజ‌ధాని బుకారెస్ట్‌లోని మ‌రో ద‌వాఖాన‌కు త‌ర‌లించామ‌న్నారు. అదేవిధంగా హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న మ‌రో ఆరుగురిని ఇత‌ర ద‌వాఖాన‌ల్లో చికిత్సం అందిస్తున్నామ‌న్నారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నామ‌ని తెలిపారు. కాగా,‌ ఈ ప్ర‌మాదానికి షార్ట్ స‌ర్క్యూటే కార‌ణ‌మ‌ని అధికారులు భావిస్తున్నారు.    

2015లో కూడా రాజ‌ధాని బుకారెస్ట్‌లో ఇలాగే భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఓ నైట్‌క్ల‌బ్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో 65 మంది మ‌ర‌ణించారు. యూరోపియ‌న్ యూనియ‌న్‌లో స‌భ్య‌దేశ‌మైన రొమేనియాలో ఆరోగ్య సంర‌క్ష‌ణ మౌలిక వ‌స‌తులు అంతంత‌మాత్రంగానే ఉన్నాయి. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 3,53,185 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 8,813 మంది బాధితులు మ‌ర‌ణించారు.