కమలా హ్యారిస్.. కొన్ని ఆసక్తికర విషయాలు

వాషింగ్టన్ : అమెరికా ఉపాధ్యక్షురాలుగా భారత మూలాలున్న కమలాదేవి హ్యారిస్ ఇవాళ ప్రమాణం చేయనున్నారు. ఈ స్థానానికి చేరుకున్న మొదటి నల్లజాతి మహిళ. అలాగే తొలి భారతీయ సంతతికి చెందిన మహిళ కూడా కావడం విశేషం. కమలాదేవి హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలు, తండ్రి డోనాల్డ్ హ్యారిస్ జమైకాకు చెందినవారు. 1964 అక్టోబర్ 20 న జన్మించిన కమలా హ్యారిస్.. ఓక్‌ల్యాండ్‌లోని వెస్ట్‌మౌంట్ హైస్కూల్ నుంచి హైస్కూల్ విద్య, యూసీ హేస్టింగ్స్ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్యను, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అభ్యసించారు. కమలా హ్యారిస్ న్యాయవాదిగా సుదీర్ఘ వృత్తి జీవితాన్ని కలిగి ఉన్నారు. అనేక విషయాలపై అమెరికన్ సంప్రదాయాలను కూడా వ్యతిరేకించారు. అమెరికన్ మైనారిటీలు లేదా నల్లజాతీయులలో ఆమెకు ఆదరణ చాలా ఎక్కువ.
చెక్కుచెదరని భారతీయత
56 ఏండ్ల కమలాకు ఆమె తల్లి డాక్టర్ శ్యామలా గోపాలన్ పేరు పెట్టారు. చదువుకునేందుకు బర్కిలీ విశ్వవిద్యాలయానికి వచ్చిన నేను ఇక్కడ స్థిరపడతానని అనుకోలేదని, భారతీయతను గుర్తుచేసేలా ఇద్దరు కుమార్తెల పేర్లను పెట్టానని కమలా తల్లి ఒక సందర్భంలో చెప్పారు. కమల సోదరి మాయ.
పోరాట స్ఫూర్తి
కమలా తల్లిదండ్రులు పౌర హక్కుల కోసం అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. కమలా కూడా వారితో కలిసి పాల్గొన్నారు. ఏం కావాలి? అని నల్లజాతి స్త్రీ ప్రశ్నించగా.. అందరికీ సమానత్వం, స్వేచ్ఛ అని కమలా సమాధానమిచ్చారు. ఆమె 13 సంవత్సరాల వయస్సులో తన వయసు పిల్లలను ఏకం చేసి కవాతు చేసింది. వీరు నివసించే మాంట్రియల్ అపార్ట్మెంట్లో పిల్లలు పచ్చికలో ఆడకుండా నిషేధించడంపై చిన్నారులందరినీ పోగుచేసిన కమల.. చిన్నపాటి ఉద్యమం చేపట్టడంతో అపార్ట్మెంట్ యాజమాన్యం దిగిరాక తప్పలేదు.
వంటలంటే ఇష్టం
అమ్మ వంటగదిలో ఏదైనా వంట చేస్తున్నదంటే చాలు.. వంటింట్లోకి పరుగెత్తుకెళ్లి చూసేదానినని, వంటలు ఎలా చేస్తుందో గమనించేదానినని 2009 లో గ్లామర్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమలా హ్యారిస్ చెప్పారు. మంచి ఆహారం పట్ల అభిమానం ఉంటే.. అది కూడా ఉడికించడం నేర్చుకోవడం మంచిదని అమ్మ చేసిన సూచనను ఇప్పటికీ పాటిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ కొత్తదనాన్ని ఎంజాయ్ చేస్తారు. తన రెసిపీలను సోషల్ మీడియాలో తరుచుగా పంచుకుంటుంటారు. 2019 లో నటి మిండీ కీలింగ్తో కలిసి మసాలా దోష తయారుచేసే వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందింది.
పుస్తకాలంటే ప్రేమ
కమలా హ్యారిస్‌కు పుస్తకాలు చదువడం అంటే చాలా ఇష్టం. 2019 ఎన్నికల ప్రచారంలో ఆమె ఈ విషయాన్ని ప్రస్తావించారు. చాలా సార్లు మనల్ని మనం అనుమానించుకోవడం చేస్తుంటామని, అలాంటి సమయాల్లో పుస్తకాల్లో చదివిన అంశాలు సహాయపడవచ్చన్నారు. తనకు ఆ ఐదు పుస్తకాలంటే అమితమైన ఇష్టమని కమలా చెప్తుంటారు. నేటివ్ సన్ (రిచర్డ్ రైట్), ది కైట్ సమ్మర్ (ఖలీద్ హుస్సేని), ది జాయ్ లక్ క్లబ్ (అమీ టెన్), సాంగ్ ఆఫ్ సోలమన్ (టోనీ మొర్రిసన్), విచ్ అండ్ ది వార్డ్రోబ్ (సీ లూయిస్) పుస్తకాలను ఎన్నిసార్లు చదివారో కూడా తనకు తెలియదంట.
సామన్యుల సమస్యలకు ప్రాధాన్యం
సామాన్య ప్రజలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడం కమలా హ్యారిస్‌కు ఎంతో ఇష్టమైన వ్యాపకంగా చెప్పుకోవచ్చు. సామాజిక సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని చాలాసార్లు చెప్పారు. 2004 నుంచి 2010 వరకు కాలిఫోర్నియా 'ఫస్ట్ ఉమెన్ డిస్ట్రిక్ట్ అటార్నీ'గా ఉన్నారు. అనంతరం మొదటి మహిళా అటార్నీ జనరల్ అయ్యారు. కమలా సూచనలతోనే కాలిఫోర్నియాలో పోలీసులు బాడీ కెమెరాలను ధరించడం మొదలైంది. మొదటిసారి మాదకద్రవ్యాల వాడకందారుల కోసం బ్యాక్ ఆన్ ట్రాక్ ప్రోగ్రాంను ప్రారంభించారు. లిన్చింగ్ను ఫెడరల్ నేరంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఆమె మొదటిసారి బిల్లును తీసుకువచ్చిన ఘనత కమలాకే దక్కింది.
బైడెన్‌తో విభేదాలు..ఆయన కొడుకుతో స్నేహం
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్న జో బైడెన్ కుమారుడి బో, కమలాదేవి హ్యారిస్ చాలా మంచి స్నేహితులని కొద్ది మందికే తెలుసు. 2015 లో బో మెదడు క్యాన్సర్‌తో మరణించాడు. పార్టీ ఫోరంలో బైడెన్, కమలా మధ్య సైద్ధాంతిక భేదాలు చాలాసార్లు వచ్చాయి. అయినప్పటికీ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎవరినైనా ఎదిరిస్తానంటూ చెప్పకనే చెప్పారు. నిన్నటి ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో ఇద్దరూ మంచి కెమిస్ట్రీతో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఘన విజయం సాధించారు.
తల్లిగా బాధ్యతలు
తల్లి బాధ్యతను నెరవేర్చడానికి డగ్ అమ్హాఫ్ ను కమలా హ్యారిస్ 2014 లో వివాహం చేసుకున్నారు. డగ్కు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారికి కమలా తల్లిలా ఎలా ఉంటుందని చాలా మంది చెవులు కొరుక్కున్నారు. ఆ చిన్నారులకు స్టెప్ మదర్‌గా ఉండను అని ఆనాడు చెప్పిన కమలా.. ఈనాటికి కన్నతల్లి కన్నా ఎక్కువగా వారిని ప్రేమిస్తుండటం విశేషం. తల్లిగా నా బాధ్యతను ఎలా నెరవేర్చాలో తనకు తెలుసునని పలు సార్లు చెప్పేవారు. మేనకోడలు మీనాను కూడా చాలా ప్రేమిస్తుంది.
సంబంధాలు, రాజకీయాలు వేరు
కమలా మేనకోడలు మీనా ఆమెపై ఒక పుస్తకం రాశారు. మీనా వృత్తిరీత్యా న్యాయవాది, ఇద్దరు కుమార్తెల తల్లి. ఇటీవల ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన తర్వాత మీనా కుమార్తె అమ్రా అందరి ముందూ కమలా హ్యారిస్ ఒడిలో కూర్చుంది. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి అమ్రా ప్రశ్నించగా.. నువ్వు కూడా ప్రెసిడెంట్ కావచ్చు.. అయితే, అందుకోసం నీకు 35 ఏండ్ల వయసు రావాలి అని విడమరిచి చెప్పడం అక్కడి వారిని ఎంతగానో ఆకట్టుకుంది. రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉంటున్నప్పటికీ భర్త, పిల్లలకు కూడా సమయం కేటాయించేలా ప్లాన్ చేసుకుంటారు. కనీసం ఒక్క రోజైనా అందరూ కలిసి భోజనం చేసేలా ప్లాన్ చేసుకోవడం ఆమె కుటుంబానికి ఇస్తున్న ప్రాధాన్యత, కుటుంబ సంబంధాల పట్ల ఆమె గౌరవం తెలుస్తున్నది.
చిరునవ్వే ఆమె బలం
డెమోక్రాట్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియ ఏడాదిన్నర క్రితం ప్రారంభమైనప్పుడు, కమలాదేవి హ్యారిస్ వాదనలు బైడెన్‌ను ఇబ్బందుల్లోకి నెట్టివేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే, ఆరోగ్య విధానంలో ఆమె వెనుకబడిపోయారు. కమలా హ్యారిస్‌తో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, న్యాయవాదికి ఉండాల్సిన లక్షణాలన్నీ కమలాలో ఉన్నాయని జో బైడెన్ అంటుండటం ఆమె గొప్పతనాన్ని చాటుతుంది. ముఖంపై చిరునవ్వు చెరిగిపోనీయకుండా ఎంతటి కష్టతరమైన పనైనా నవ్వుతూ చేసేయడమే తన పాలసీ అంటుంటారు. నవ్వుతో ఎంటివారినైనా ఓడించవచ్చునని చెప్తుంటారు.
రంగు-జాతి సమస్య
కమలాదేవి హ్యారిస్‌ను ఉపాధ్యక్షురాలుగా పోటీ చేయించాలని బైడెన్ నిర్ణయించుకున్నప్పుడు చాలా ప్రశ్నలు తలెత్తాయి. కమలా మైనార్టీ కావడం వల్లనే ఆమెకు అవకాశం లభిస్తోందని చాలా మంది వ్యాఖ్యలు చేశారు. వలస వచ్చిన వారు, తక్కువ రంగు వారు కూడా మనుషులేనని, ఒక సమాజంలో నాయకులను వారి నేపథ్యం లేదా రంగు కారణంగా గుర్తించడం తప్పు అని రెండేండ్ల క్రితమే చెప్పుకొచ్చారు. రంగు అనేది మీరు ఆలోచించే విషయం కానీ, తనకు సమస్యే కాదని ఘంటాపథంగా చెప్పడం కమలాకే చెల్లు.
ఇవి కూడా చదవండి..
వైట్‌హౌస్‌కు ఆ పేరెలా వచ్చింది.. దాని చరిత్ర మీకు తెలుసా!
సముద్రాలను భయపెడుతున్న ప్లాస్టిక్ భూతం
అణు రియాక్టర్ 'అప్సర' ప్రారంభం
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- నేడు తాకట్టు ఆస్తులు వేలం: ఎస్బీఐ
- రైతు ఆదాయం రెట్టింపు ఎలా?
- చమురు ధరల పెంపు అహేతుకం
- మళ్లీ పుంజుకున్న బిట్‌కాయిన్
- నీతిమాలిన నిందలు
- హిందుత్వానికి అసలైన ప్రతీక
- కోటక్ చేతికి ఆర్మీ జవాన్ల వేతన ఖాతాలు!
- అదనపు భద్రత+ ఏబీఎస్‌తో విపణిలోకి బజాజ్ ప్లాటినా-110
- మిల్క్ టూ వంటనూనెల ధరలు ‘భగభగ’!..
- ఎమ్మెల్సీ పదవి అంటేనే రాంచందర్‌రావుకు చిన్నచూపు