గురువారం 16 జూలై 2020
International - Jun 13, 2020 , 03:25:35

నేపాల్‌ పోలీసుల కాల్పుల్లో భారతీయుడి మృతి

నేపాల్‌ పోలీసుల కాల్పుల్లో  భారతీయుడి మృతి

మరో ఇద్దరికి గాయాలు.. 

ఇండో- నేపాల్‌ సరిహద్దు వద్ద ఘటన

పాట్నా/కఠ్మాండూ, జూన్‌ 12: ఇండో-నేపాల్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లాక్‌డౌన్‌ వేళ తమ భూభాగంలోకి ప్రవేశించారనే కారణంతో నేపాల్‌ పోలీసులు జరిపిన కాల్పుల్లో భారత్‌కు చెందిన వికేశ్‌యాదవ్‌ (22) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. లగాన్‌ యాదవ్‌ అనే మరో వ్యక్తిని (45) ఆ దేశ సరిహద్దు బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. బీహార్‌లోని సీతామర్హి జిల్లా సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకున్నది. ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదం ముదిరిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఘటన జరుగడం ఉద్రిక్తతలను పెంచింది. కాల్పుల ఘటనపై ‘సశస్త్ర సీమా బల్‌' (ఎస్‌ఎస్‌బీ) డైరెక్టర్‌ జనరల్‌ కుమార్‌ రాజేశ్‌ చంద్ర స్పందిస్తూ.. ప్రాథమిక దర్యాప్తు అనంతరం కేంద్రం హోం శాఖకు నివేదిక అందించినట్లు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని తెలిపారు. 

నేపాలీ కోడలిని కలువడానికి వెళ్లి..

ఇరు దేశాల సరిహద్దుల్లో ఎలాంటి ఫెన్సింగ్‌ లేనందున స్థానికులు సాధారణంగానే రాకపోకలు సాగిస్తుంటారు. నేపాలీ అయిన తన కోడలిని కలిసేందుకు లగాన్‌ యాదవ్‌తోపాటు మరికొందరు నేపాల్‌ భూభూగంలోకి వెళ్లారు. వీరిని గమనించిన నేపాల్‌ సరిహద్దు పోలీసులు (ఏపీఎఫ్‌) వారిని వెనక్కి వెళ్లాలంటూ ఆదేశించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నదని ఎస్‌ఎస్‌బీ ఐజీ సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ వేళ తమ భూభాగంలోకి భారతీయులు రావడంపై నేపాల్‌ బలగాలు అభ్యంతరం తెలిపినట్లు చెప్పారు.  ఏపీఎఫ్‌ ఏఐజీ నారాయణ్‌ బాబు తాపా మాట్లాడుతూ.. 25 నుంచి 30 మంది భారతీయులు నేపాల్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. ‘లాక్‌డౌన్‌ ఉన్నందున భద్రతాదళాలు వారిని అడ్డుకున్నాయి. వీరితో పదుల సంఖ్యలో ఇతరులు కూడా జతకట్టారు. భద్రతాదళాలపై రాళ్లు విసిరారు. ఓ సైనికుడి తుపాకీని బలవంతంగా లాక్కుని గాల్లోకి కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు’ అని చెప్పారు. అలాగే లగాన్‌ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటన నేపథ్యంలో ఇరుదేశాల బలగాలు శనివారం ఫ్లాగ్‌ మీటింగ్‌ నిర్వహించనున్నాయి.


logo