బుధవారం 03 జూన్ 2020
International - Apr 05, 2020 , 02:08:15

రెండున్నర నిమిషాలకు ఒకరు మృతి

రెండున్నర నిమిషాలకు ఒకరు మృతి

  • న్యూయార్క్‌లో మృత్యుకేళి
  • ఒక్కరోజే 562 చావులు
  • అమెరికాలో ఒకేరోజు 1,500 మంది మృతి 

న్యూయార్క్‌: అమెరికాను కరోనా వైరస్‌ గజగజ వణికిస్తున్నది. ముఖ్యంగా న్యూయార్క్‌ రాష్ట్రం శవాల దిబ్బగా మారుతున్నది. శ్మశానవాటికలు కిక్కిరిపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన మార్చురీల్లో శవాలను భద్రపరుస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే న్యూయార్క్‌లో 562 మరణాలు నమోదయ్యాయి. ఆ నగరంలో రెండున్నర నిమిషాలకు ఒకరు చొప్పున చనిపోతున్న ట్టు గణాంకాలు చెప్తున్నాయి. న్యూయార్క్‌ లో మొత్తం మృతుల సంఖ్య 2,935కు చేరుకొన్నది. లక్షకుపైగా ప్రజలు క్వారంటైన్‌ లో ఉన్నారు. న్యూయార్క్‌ నగరంలో 56,289 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ నిపుణులకు కావాల్సిన పరికరాల కొరత ఉండటంతో కేసులు పెరుగుతున్నాయని న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో విచారం వ్యక్తంచేశారు. మరోవైపు అమెరికాలో కరోనా కేసులు మూడులక్షలు, మృతుల సంఖ్య ఎనిమిది వేలు దాటింది. అగ్రరాజ్యంలో కరోనా బారినపడి ఒకేరోజు దాదాపు 1500 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్యారి ప్రారంభమైనప్పటి నుంచి ఒకరోజు నమోదైన అత్యధిక మరణాల సంఖ్య ఇదే. గురువారం రాత్రి 8.30 నుంచి శుక్రవారం అదే సమయానికి 1480 మంది కరోనాతో మరణించారు. 


logo