70 దేశాలు.. ఏడు కోట్ల మంది సైన్యం.. నాలుగేళ్ల యుద్ధం!

Sun,November 11, 2018 12:55 PM

World War one in Numbers

లండన్: లక్షల మంది చనిపోయారు.. మరెన్నో లక్షల మంది గాయపడ్డారు.. 52 నెలల పాటు జరిగిన యుద్ధంలో ఏకంగా 70కి పైగా దేశాలు పాల్గొన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి సరిగ్గా వందేళ్లయింది. ఈ సందర్భంగా ఏఎఫ్‌పీ ఈ యుద్ధానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

అప్పట్లో ఆస్ట్రియా-హంగరీ, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఒటోమాన్ దేశాల కింద ఉన్న సుమారు 70కిపైగా దేశాలను ఈ యుద్ధంలో భాగం చేశారు. 12 స్వతంత్ర దేశాలు 1914లో తొలిసారి యుద్ధానికి కాలు దువ్వాయి. ఆ తర్వాత మిగతా దేశాలు ఒక్కొక్కటిగా యుద్ధంలో పాలు పంచుకున్నాయి. 1915లో ఇటలీ, 1917లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుద్ధంలో చేరాయి. ఆ సమయంలో ఈ దేశాల మొత్తం జనాభా 80 కోట్లకుపైనే ఉంది. కేవలం 20 దేశాలు మాత్రమే తటస్థంగా ఉంటూ యుద్ధంలో పాలు పంచుకోలేదు. వీటిలో చాలా వరకు లాటిన్ అమెరికా లేదా ఉత్తర యూరప్‌కు చెందిన దేశాలే.

యుద్ధం ప్రారంభమైన సమయంలో 2 కోట్ల మంది పాలు పంచుకోగా.. అది ఆ తర్వాతి కాలంలో మెల్లగా 7 కోట్లకు చేరింది. ఫ్రాన్స్ నుంచి 80 లక్షలు, కోటి 30 లక్షల మంది జర్మనీ నుంచి, ఆస్ట్రియా-హంగరీ నుంచి 90 లక్షల మంది, ఇటలీ నుంచి 60 లక్షల మంది సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు. ఇక బ్రిటన్ నుంచి 90 లక్షల సైనికులు పాల్గొనగా.. అందులో ఎక్కువగా ఇండియా నుంచే ఉన్నారు. అమెరికా నుంచి 40 లక్షల మంది సైనికులు యుద్ధంలో చేరారు.

ఇక యుద్ధంలో మొత్తం కోటి మందికిపైగా సైనికులు మరణించారు. ఇందులో ఎక్కువగా జర్మనీ, రష్యాలకు చెందిన సైనికులే ఉన్నారు. ఇక అంతకు రెట్టింపు సంఖ్యలో సైనికులు గాయపడ్డారు. రష్యాకు చెందిన 20 లక్షల మంది చనిపోగా, 50 లక్షల మంది గాయపడ్డారు. జర్మనీ నుంచి 20 లక్షల మంది మరణించగా, 42 లక్షల మంది గాయపడ్డారు. బ్రిటన్, బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన మొత్తం 9 లక్షల 60 వేల మంది మరణించగా.. 20 లక్షల మంది గాయపడ్డారు. యుద్ధం మొదలైన కొన్ని వారాల్లోనే ఈ మరణాలు ఎక్కువగా సంభవించాయి.

ఈ యుద్ధంలో తొలిసారి ఎక్కువ మొత్తంలో రసాయన ఆయుధాలను ప్రయోగించారు. 1915లో తొలిసారి జర్మనీ బలగాలు బెల్జియంలో క్లోరిన్ గ్యాస్‌ను ప్రయోగించాయి. ఈ యుద్ధంలో రసాయన ఆయుధాల కారణంగా మొత్తం 20 వేల మంది చనిపోయారు. ఇక నాలుగేళ్లకుపైగా సాగిన మొదటి ప్రపంచ యుద్ధంలో కోటి మంది వరకు సాధారణ పౌరులు కూడా మృత్యువాత పడ్డారు.

యుద్ధంలో మొత్తం 60 లక్షలకుపైగా యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. యూరప్ వ్యాప్తంగా ఈ యుద్ధం కారణంగా కోటి మందికిపైగా శరణార్థులుగా మిగిలిపోయారు. 60 లక్షల మంది అనాథలుగా మిగలగా.. 30 లక్షల మంది వితంతువులయ్యారు. యుద్ధం మొత్తంలో 130 కోట్ల బుల్లెట్లను ఫైర్ చేశారు. యుద్ధం పాల్గొన్న సైనికులు సుమారు వెయ్యి కోట్ల వరకు ఉత్తరాలను తమ ఆత్మీయులకు పంపించారు.

2524
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles