కొంప ముంచుతున్న నిద్ర లేమి.. ఏటా లక్ష కోట్ల డాలర్ల నష్టం!

Tue,January 8, 2019 03:19 PM

World loosing over trillion dollars every year due to lack of sleep

ప్రపంచవ్యాప్తంగా టాప్ కంపెనీలు ఇప్పుడు తమ ఉద్యోగులకు ఓ విషయాన్ని నొక్కి చెబుతున్నాయి. పని ఒత్తిడిని ఇంటికి తీసుకెళ్లకండి.. సరిగా నిద్రపోండి అన్నది ఆ సందేశం. ఎందుకంటే నిద్ర లేమి కారణంగా ప్రపంచం ప్రతి ఏటా లక్ష కోట్ల డాలర్ల మేర నష్టపోతున్నట్లు తాజా సర్వేలో తేలింది. రాండ్ అనే సంస్థ 34 ఓఈసీడీ దేశాల్లో సర్వే నిర్వహించి.. నిద్ర లేమి కారణంగా వస్తున్న నష్టాలను అంచనా వేసింది. ఉద్యోగులు తమ పని ఒత్తిడిని ఇంటికి తీసుకెళ్తున్నారు. అక్కడా పని చేస్తున్నారు. దీనివల్ల రాత్రి సరిగా నిద్రపోవడం లేదు. సరిపడా విశ్రాంతి లేకుండానే మళ్లీ ఆఫీసులకు వస్తున్నారు. దీనివల్ల ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతున్నది. ఇలా భారీ నష్టాలు కంపెనీల కొంప ముంచుతున్నాయి.

ప్రపంచంలో అందరి కన్నా ఎక్కువ కష్టపడి పని చేస్తారని జపాన్ దేశస్థులకు పేరుంది కదా. దీని కారణంగా అక్కడి ఉద్యోగులపై ఒత్తిడి కూడా చాలా తీవ్రంగానే ఉంటున్నది. ఫలితంగా ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. పని ఒత్తిడి ఎక్కువై చిన్న వయసులోనే మృత్యువాత పడుతున్నారు. అయితే ఉద్యోగులకు నిద్ర లేమి కారణంగా ఎక్కువగా నష్టపోతున్న దేశాల్లో మాత్రం అగ్రరాజ్యం అమెరికానే ముందుంది. అమెరికా ప్రతి ఏటా 41100 కోట్ల డాలర్లు నష్టపోతున్నది. జపాన్ 13800 కోట్ల డాలర్ల నష్టంతో రెండోస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో జర్మనీ, యూకే, కెనడా ఉన్నాయి. అటు ఆస్ట్రేలియాలోనూ నిద్ర లేమి కారణంగా కలుగుతున్న నష్టంపై ప్రత్యేకంగా సర్వే నిర్వహించారు. దీని ఫలితాలను స్లీప్ అనే జర్నల్‌లో ప్రచురించారు. దీని ప్రకారం ఆస్ట్రేలియా ఏటా 4500 కోట్ల డాలర్లు నష్టపోతున్నది.

అయితే ప్రపంచంలో అత్యధిక వర్క్ పోర్స్ ఉన్న ఇండియా, చైనాలు ఈ జాబితాలో లేవు. అంతమాత్రాన నిద్ర లేమి వల్ల ఈ దేశాలు నష్టపోవడం లేదని కాదు. ఇక్కడి నష్టాలను ఇప్పటివరకు ఎవరూ లెక్కించలేకపోయారు. ఉద్యోగులకు ఈ నిద్ర లేమి సమస్య లేకుండా చేయడానికి జపాన్‌లోని కొన్ని కంపెనీలు చర్యలు చేపట్టాయి. కంపెనీల్లోనే ఉద్యోగులు కాసేపు కునుకు తీయడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాయి. ఈ స్లీపింగ్ రూమ్స్‌లోకి నిద్రను పాడు చేసే మొబైల్ ఫోన్స్, టాబ్లెట్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం లేదు. పైగా ఉద్యోగులు ఎక్కువసేపు కంపెనీల్లో ఉండకుండా చూస్తున్నారు.

5403
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles