పేరు బయటికి వస్తుందని.. 3600 కోట్ల ప్రైజ్ మనీని తిరస్కరించింది!

Tue,February 6, 2018 05:44 PM

Woman refuses to reveal her details public when she won $560 Million Powerball

లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. కోటి అసలే కాదు.. 10 కోట్లు అంతకన్నా కాదు.. 100 కోట్లు..1000 కోట్లు.. అంతకు మించి దాదాపు 3600 కోట్ల రూపాయలను తృణప్రాయంగా వదిలేసింది ఓ మహిళ. తలుపు తట్టి ఇంటికొచ్చిన లక్ష్మిని కాదనుకుంది. ఎందుకు.. కారణం ఒకటే. అది సిల్లీగా అనిపించొచ్చు. కాని.. అదే తనకు ముఖ్యం. అందుకే సింపుల్‌గా ఆ ప్రైజ్ మనీని రిజెక్ట్ చేసింది.. కాస్త వివరంగా చెప్పుకుందామా?

యూకేలోని న్యూ హాంప్‌షైర్‌కు చెందిన ఓ మహిళకు పవర్‌బాల్ లాటరీ తగిలింది. నక్క తోకను తొక్కి వచ్చినట్టుంది అందుకే 560 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకుంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 3600 కోట్లు. వామ్మో.. అంత డబ్బును లెక్కపెట్టడానికే కొన్ని రోజులు పడుతుంది. అయితే.. అందరిలాగానే తను కూడా అంత పెద్ద ప్రైజ్ మనీ రావడంతో ఆశ్చర్యంతో పాటు ఆనందపడింది. ప్రైజ్ మనీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూసింది. కాని.. ఆ ప్రైజ్ మనీ తీసుకోవడానికి లాటరీ రూల్స్ తనకు అడ్డం వచ్చాయి. ఎవరైనా లాటరీ గెలిస్తే.. వాళ్ల పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్.. ఇతర వివరాలన్నీ బయటి వ్యక్తులకు తెలిసేలా లాటరీ నిర్వాహకులు చేస్తారు. అలా చేస్తేనే లాటరీ నిర్వహణలో పారదర్శకత ఉంటుందని.. లేకపోతే.. లాటరీ గెలుపొందిన వారి వివరాలపై కస్టమర్లకు నమ్మకం ఉండదని వాళ్ల భావన.
అందుకే.. లాటరీ గెలిచిన వారికి సన్మాన సభ లాగ ఏర్పాటు చేసి మీడియాను పిలిచి.. హడావుడి చేసి... వాళ్లకు ప్రైజ్ మనీ చెక్‌ను అందజేసి... ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు.. ఇలా చేస్తేనే కదా వాళ్లకు మార్కెటింగ్ అయ్యేది. కాని.. వీటన్నింటికి సదరు మహిళ నో చెప్పింది. తన డిటెయిల్స్‌ను పబ్లిక్‌గా రిలీజ్ చేయడానికి వీల్లేదని బల్ల గుద్ది మరీ చెప్పింది.

కాని.. లాటరీ రూల్స్ ప్రకారం.. ఖచ్చితంగా లాటరీ గెలిచిన వ్యక్తి డిటేయిల్స్ పబ్లిక్‌గా ఇవ్వాల్సిందేనని.. దీనిపై వెనక్కి వెళ్లే సమస్యే లేదని లాటరీ నిర్వాహకులూ తేల్చి చెప్పారు. దీంతో తన వివరాలు బయటికి వెల్లడించేటట్లయితే.. ఆ లాటరీ డబ్బులు తనకు అవసరం లేదని ఆ మహిళ తిరస్కరించింది.

"ఒకవేళ నా వివరాలన్నీ బయటికి తెలిస్తే.. ఇప్పుడు ఉన్నట్లు నేను అప్పుడు ఉండలేను. షాపింగ్ మాల్ వెళ్లినా.. ఎక్కడికెళ్లినా... బయట ప్రజలు నన్ను అదోరకంగా చూస్తారు. నా లక్కు వల్లే నాకు ఇన్ని డబ్బులు వచ్చాయని భావిస్తారు. నా స్వేచ్ఛ నాకు ఉండాలి. లాటరీ గెలిచిన వ్యక్తిలా నేను సమాజంలో నిలవాలనుకోవట్లేదు".. అని ఆ మహిళ తెలిపింది.

నవంబర్ 2015 క్రైగరీ బర్చ్ అనే వ్యక్తి పవర్ బాల్ లాటరీలో 434,272 డాలర్లను గెలుచుకున్నాడు. అతడి వివరాలన్నీ పబ్లిక్‌కు వెల్లడించింది లాటరీ యాజమాన్యం. లాటరీ గెలిచిన రెండు నెలల తర్వాత.. బర్చ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లోనే చంపేసి.. లాటరీ డబ్బులు ఎత్తుకెళ్లారు. లాటరీలో డబ్బులు గెలిచాడని యాజమాన్యం.. పబ్లిక్‌గా అనౌన్స్ చేయడం వల్లనే బర్చ్ చనిపోయాడని అప్పట్లో అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొనే ఆ మహిళ తన వివరాలను బయటికి వెల్లడించడానికి ఒప్పుకోకపోయి ఉండొచ్చని లాటరీ నిర్వాహకులు భావించారు.

8206
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles