రష్యాతో న్యూక్లియర్ ఒప్పందానికి అమెరికా గుడ్‌బై!

Sun,October 21, 2018 12:43 PM

US to come out of INF treaty with Russia

వాషింగ్టన్: రష్యాతో ఉన్న 31 ఏళ్ల న్యూక్లియర్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 1987లో ఈ రెండు దేశాల మధ్య ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ (ఐఎన్‌ఎఫ్) కుదిరింది. అయితే ఈ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘిస్తున్నదని, ఎన్నో ఏళ్లుగా ఇదే జరుగుతున్నదంటూ ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందంపై రష్యాతో చర్చించడంగానీ, బయటకు రావడంగానీ ఒబామా ఎందుకు చేయలేదో నాకు అర్థం కావడం లేదు. వాళ్లు అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇష్టం వచ్చినట్లుగా ఆయుధాలు తయారు చేస్తుంటే చూస్తూ ఊరుకోం. మేము మాత్రమే ఆ ఒప్పందంలో ఉన్నాం. గౌరవించాం. రష్యా అలా చేయలేదు. అందుకే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని అనుకుంటున్నాం. అందుకే దీని నుంచి బయటకు వస్తాం అని ట్రంప్ స్పష్టంచేశారు.

1987 డిసెంబర్‌లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, యూఎస్‌ఎస్‌ఆర్ మాజీ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఉపరితలం నుంచి 300 నుంచి 3400 మైళ్ల పరిధిలో ప్రయోగించగలిగే బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైళ్లను రెండు దేశాలు ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. కోల్డ్ వార్ సమయంలో ఈ రెండు దేశాల మధ్య కుదిరిన కీలక ఒప్పందంగా దీనిని పరిగణిస్తారు. అయితే ఈ ఒప్పందాన్ని రష్యా పదే పదే ఉల్లంఘిస్తున్నదంటూ ట్రంప్ ప్రభుత్వం చెబుతూ వస్తున్నది. 2008లో రష్యా క్రూయిజ్ మిస్సైల్స్ పరీక్షలు జరిపిందని కూడా ఆరోపించింది. ఈ విషయాన్ని నాటో సంకీర్ణ దేశాలకు కూడా తెలియజేసింది.

993
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles