
పత్రికల్లో వ్యాసాలు రావడం మామూలే. కానీ న్యూయార్క్ టైమ్స్ పత్రిక సంపాదక పేజీకి కుడివైపున ఉండే ఆప్-ఎడ్ పేజీలో ఓ వ్యాసం వచ్చింది. వ్యాసకర్త పేరు మాత్రం ఇవ్వలేదు. అదో ఆకాశరామన్న వ్యాసం. ఆ ఆకాశరామన్న అనే పిరికిపంద ఎవరో నాకు తెలియాలి అని మూడుసార్లు ట్రంప్ గర్జించారు. ఇలా భగ్గుమనడానికి బలమైన కారణమే ఉంది. ఆ ఆకాశరామన్న సర్కారు లోపలి మనిషే. వ్యాసంలో బయటపెట్టిన విషయాలు మామూలువి కావు. సర్కారు పరువు, కాదకాదు ట్రంప్ పరువు గంగలో కలిపేవి. ట్రంప్ తలతిక్క నిర్ణయాలు తీసుకోకుండా నానాతంటాలు పడి అడ్డుకుంటున్నామని సదరు వ్యాసకర్త వెల్లడించారు. వ్యాసకర్త ఓటర్ల తీర్పును అవమానిస్తున్నారని, ప్రజస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారని ట్రంప్ రకరకాలుగా మండిపడుతున్నారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, విదేశాంగమంత్రి మైక్ పాంపియో, రక్షణమంత్రి జిమ్ మాటిస్ తదితరులు ఆ వయాసంతో తమకు సంబంధం లేదని వివరణలు ఇచ్చుకున్నారు. ఆ పత్రిక సదరు వ్యాసాన్ని ప్రచురించకుండా ఉంటే బాగుండేదని ప్రథమ మహిళ మెలానియె ట్రంప్ ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. యావత్తు ప్రభుత్వాన్ని ఆకాశరామన్న వ్యాసం ఆవిధంగా ఊపేసింది. కలం బలం అంటే ఇదే మరి.