చైనా, అమెరికా మధ్య ముదురుతున్న వాణిజ్య యుద్ధం

Wed,April 4, 2018 04:27 PM

Trade war escalating between China and US

బీజింగ్: చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకూ ముదురుతున్నది. అమెరికాలోకి దిగుమతి అయ్యే 1300 చైనా వస్తువులపై 25 శాతం దిగుమతి సుంకం విధించాలని మంగళవారం అమెరికా నిర్ణయించిన విషయ తెలిసిందే. ఈ మొత్తం దిగుమతుల విలువ ఏడాదికి 5 వేల కోట్ల డాలర్లు. ఇప్పుడు అమెరికాను చైనా దెబ్బకు దెబ్బ కొట్టింది. చైనాలోకి దిగుమతి అయ్యే 106 అమెరికా ఉత్పత్తులపై 25 శాతం దిగుమతి సుంకం విధించాలని బుధవారం ఆ దేశం నిర్ణయించింది. ఈ మొత్తం దిగుమతుల విలువ కూడా ఏడాదికి 5 వేల కోట్ల డాలర్లే కావడం గమనార్హం. ఈ 106 ఉత్పత్తుల్లో ఎయిర్‌క్రాఫ్ట్స్, కార్లు, కెమికల్స్, సోయాబీన్స్‌లాంటి వస్తువులు ఉన్నాయి.

ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థికవ్యవస్థల మధ్య జరుగుతున్న ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నది. చైనా తమ వస్తువులపై దిగుమతి సుంకాలు వసూలు చేయనున్నదన్న నేపథ్యంలో అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. ట్రంప్ తెరతీసిన ఈ వాణిజ్య యుద్ధంలో అమెరికాను చర్చలకు దింపాలన్న ఉద్దేశంతోనే చైనా ఇలా వ్యవహరిస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. చైనా అసలు ఉద్దేశం వాణిజ్య యుద్ధాన్ని పెంచడం కాదు.. తాము బలహీనం కాదు అని చూపెట్టే ప్రయత్నం అని ఆర్థికవేత్త ఐదన్ యావో చెప్పారు. అయితే రెండు దేశాలు విధించిన ఈ దిగుమతి సుంకాలు అమలవుతాయా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు.

ఎప్పటి నుంచి అమలు చేస్తామో తర్వాత చెబుతామని చైనా అంటున్నది. అటు అమెరికా తమ ప్రణాళికలను వచ్చే నెలలో వ్యాపారవేత్తలతో చర్చిస్తామని చెబుతున్నది. దీంతో కనీసం మరో రెండు నెలల వరకైతే ఈ కొత్త దిగుమతి సుంకాలను రెండు దేశాలూ వసూలు చేయవని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ రెండు నెలల్లో చర్చలు కొలిక్కి రాకపోతే మాత్రం వాణిజ్య యుద్ధం మొదలైనట్లే అని సింగపూర్‌కు చెందిన ఆర్థికవేత్త టామీ జీ చెప్పారు. అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకాలు చైనా ఏరోస్పేస్, టెక్, మెషినరీ ఇండస్ట్రీలను లక్ష్యంగా చేసుకునే ఉన్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం ఇది తమ చట్టపరమైన హక్కులను కాలరాయడమే అవుతుందని చైనా వాదిస్తున్నది.

1550
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles