HomeLATEST NEWSStatue of Liberty shut down as thousands of tourists left high and dry

మూతబడిన స్టాచూ ఆఫ్ లిబర్టీ!

Published: Sun,January 21, 2018 12:05 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
న్యూయార్క్‌ః అమెరికాలో పాలన స్తంభించింది. ఆ ప్రభావం ఆ దేశానికి వెళ్లిన టూరిస్టులపైనా పడింది. అమెరికాలో ప్రముఖ పర్యాటక స్థలమైన న్యూయార్క్‌లోని స్టాచూ ఆఫ్ లిబర్టీ కూడా శనివారం మూతపడింది. అసలే వీకెండ్ కావడంతో ఆ స్టాచూ దగ్గరికి పడవల్లో వెళ్లడానికి వచ్చిన వేలాది మంది టూరిస్టులు తీవ్ర అసహనానికి గురయ్యారు. మన్‌హటన్‌లోని బ్యాటరీ పార్క్ మొత్తాన్నీ మూసేశారు. కాంగ్రెస్‌లో అధికార రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య అవగాహన కుదరకపోవడంతో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందని విషయం తెలిసిందే. దీంతో అమెరికా ప్రభుత్వం మూతపడింది. ఆ ప్రభావం పర్యాటక స్థలాలపైనా పడింది. నిజానికి ఒకవేళ కాంగ్రెస్‌లో బిల్లు ఆమోదం పొందకపోతే శనివారం నుంచి బ్యాటరీ పార్క్‌ను మూసేస్తామని నేషనల్ పార్క్ సర్వీస్ శుక్రవారమే ప్రకటించింది. అయితే ఈ విషయం చాలా మందికి తెలియలేదు. ఎన్నో నెలల ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న దేశ విదేశాల టూరిస్టులు వేల సంఖ్యలో బ్యాటరీ పార్క్‌కు వచ్చారు. అది మూసి ఉండటంతో అసంతృప్తి వ్యక్తంచేశారు. అక్కడి నిర్వాహకులను ఏమీ అనకపోయినా.. వాషింగ్టన్‌లోని పాలకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు టూరిస్టులైతే మళ్లీ అమెరికాలో అడుగుపెట్టమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అసలేం జరిగిందంటే..
వలసలు, వ్యయాలపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన నేపథ్యంలో సెనేట్‌లో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో ఐదేండ్లలో మొదటిసారిగా ప్రభుత్వ లావాదేవీలు నిలిచిపోయాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చి శనివారంతో ఏడాది పూర్తయింది. మొదటి సంవత్సర పాలన చివరికి ఇలా గందరగోళం నడుమ ముగిసింది. అమెరికా సెనేట్‌లో జనవరి 19లోగా ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం నాడు చివరి నిమిషం వరకూ పలువురితో సంప్రదింపులు జరిపారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోవడానికి డెమోక్రాట్లే కారణమని ఆయన ఆరోపించారు. అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్‌తోపాటు ఇతర ప్రభుత్వ సంస్థల కోసం నిధులు మంజూరు చేసే స్వల్పకాలిక వినిమయ బిల్లును డెమోక్రాట్లతోపాటు కొందరు రిపబ్లికన్లు కూడా అడ్డుకున్నారు.

పన్ను రాయితీలు ప్రకటించి తాము సాధించిన విజయాలను అడ్డుకొనేందుకే డెమోక్రాట్లు ద్రవ్య బిల్లును వ్యతిరేకించారని ట్రంప్ మండిపడ్డారు. బిల్లు ఆమోదం పొందకపోవడంతో ఫిబ్రవరి 16 వరకూ ప్రభుత్వం మూతపడుతుంది. అక్రమంగా వలస వచ్చిన వారు దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటంతో వారి విషయమై చర్చలు జరిపే విధంగా ఒత్తిడి తెచ్చేందుకు డెమోక్రాట్లు ఇటువంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. డెమోక్రాట్లు దేశ సైన్యం, భద్రతకన్నా అక్రమవలసదారులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ బంద్ ప్రభావం సోమవారం నుంచి కనిపించవచ్చని భావిస్తున్నారు. మొత్తం 35 లక్షల మంది ఉద్యోగులకు గాను ఎనిమిదిన్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరి పరిస్థితుల్లో విధులకు హాజరు కాకుండా ఇంటివద్దనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారికి 40 రోజులపాటు వేతనంలేని సెలవును ప్రకటించారు. అంతవరకు కేవలం అత్యవసర సేవల విభాగాలు మాత్రమే పనిచేస్తాయి. ప్రతినిధుల సభలో ద్రవ్య వినిమయ బిల్లు 230-197 ఓట్లతో ఆమోదం పొందింది.
1668
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology