పొగ తాగుతున్నారా? ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే..

Thu,November 21, 2019 11:22 AM

పొగాకు ప్రాణాంతకం..! ఇది తెలిసీ చాలా మంది ధూమపానానికి బానిసలవుతున్నారు. మానేద్దాం.. మానేద్దాం.. అనుకుంటూనే.. దానిని కొనసాగిస్తున్న వారెందరో..! పొగాకు తాగేవారితో పాటు.. వారి కుటుంబ సభ్యులు, వారి చుట్టూ ఉన్నవారు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. పొగ తాగే అలవాటుకు సాధ్యమైనంత తొందరగా పొగబెట్టకపోతే.. అది చివరకు మన ప్రాణాలకే ముప్పుగా మారుతుంది. ఓ వ్యక్తి పొగకు బానిస అవడంతో.. అతని ఊపిరితిత్తులు పూర్తిగా నల్లగా మారిపోయాయి. ఆ ఊపిరితిత్తులను చూస్తే మనం కూడా జంకాల్సిందే. అవి ఊపితిత్తులా..! అనే ప్రశ్న తప్పకుండా ఉత్పన్నమవుతుంది.


చైనాకు చెందిన ఓ 52 ఏళ్ల వ్యక్తి బ్రెయిడ్‌ డెడ్‌కు గురయ్యాడు. ఆ వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. దీంతో ఆ వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. మృతదేహాన్ని స్కాన్‌ చేస్తున్న క్రమంలో అతని ఊపిరితిత్తులను చూసిన డాక్టర్లు షాక్‌కు గురయ్యారు. ఊపిరితిత్తులు నల్లగా మారిపోయాయి. నిత్యం పొగాకు సేవించడం వల్లే ఊపిరితిత్తులు ఆ విధంగా మారాయని వైద్యులు తెలిపారు. దీంతో అతని ఊపిరితిత్తులు ట్రాన్స్‌ప్లాంట్‌ చేసేందుకు పనికి రావని డాక్టర్లు తేల్చిచెప్పారు.

30 ఏళ్లుగా సిగరెట్లు తాగడం వల్లే..


ఈ వ్యక్తి గత 30 ఏళ్ల నుంచి ప్రతి రోజు సిగరెట్లు తాగుతున్నాడు. రోజుకు ఒక ప్యాకెట్‌ చొప్పున అతను సిగరెట్లు తాగేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ప్రతి రోజు సిగరెట్లు తాగే అలవాటు ఉంటే.. అటువంటి వ్యక్తులు ఊపిరితిత్తులను దానం చేసేందుకు ముందుకు రాకపోవడమే మంచిదని వైద్యులు చెప్పారు. పొగకు బానిస కాకుండా ఉంటే మంచిదని డాక్టర్లు తెలిపారు.

ఇది ఉత్తమమైన యాడ్‌..


పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులు ఎలా పాడవుతాయో చెప్పడానికి ఈ వీడియో చక్కని ఉదాహరణగా ఉంటుందని నెటిజన్లు చెబుతున్నారు. ఈ వీడియోను విస్తృతంగా ప్రచారం చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ వీడియోను చూసిన కొందరైతే.. తాము సిగరెట్‌కు దూరంగా ఉంటామని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 25 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి ఏడాది 8 మిలియన్ల మందికి పైగా పొగాకు ఉత్పత్తులను సేవించడం వల్ల చనిపోతున్నారు.

3676
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles