వయసు ఏడేళ్లు... సంపాదన రూ.150 కోట్లు!

Tue,December 4, 2018 03:29 PM

Seven-year-old earns over Rs 150 crores by just reviewing toys on his YouTube channel

ఫేస్‌బుక్ సహవ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ 22ఏళ్లు.. మైక్రోసాఫ్ట్ కో ఫౌండ‌ర్‌ బిల్‌గేట్స్ 26ఏళ్ల వయసులో మిలియనీర్లుగా అవతరించారు. డ‌బ్బు సంపాద‌న‌లో ఎంతోమందికి వీరిద్ద‌రూ ఆద‌ర్శంగా నిలిచారు. అతి తక్కువ సమయంలో భారీ మొత్తంలో సంపాదించాలంటే కొన్నేళ్లపాటు వేచి ఉండాల్సిందే. అందులోనే ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కానీ, అమెరికాకు చెందిన ఏడేళ్ల‌ బుడ‌త‌డు... ఈ ఏడాదిలో రూ.150 కోట్లు సంపాదించాడు. సోష‌ల్‌మీడియాలో కోట్లాది అభిమానుల్ని తెచ్చుకున్నాడు. 2015లో ఈ చిన్నోడు.. ‘రియాన్‌ టాయ్స్‌ రివ్యూ’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించాడు. రోజూ చిన్నారుల బొమ్మల వీడియోలు అప్‌లోడ్‌ చేసేవాడు. కొద్దిరోజుల్లో ఆ వీడియోలకు అభిమానులు పెరిగిపోయారు. చిన్నారుల‌ను బాగా ఆక‌ర్షించాయి. ఇప్ప‌డవే వీడియోలు కోట్ల రూపాయ‌ల‌ను కురిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రియాన్‌ ఛానల్‌ను దాదాపు కోటికి పైగా అభిమానులు ఫాలో అవుతున్నారు.

ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ తాజాగా ప్ర‌క‌టించిన జాబితాలో అమెరికాకు చెందిన ఆ యూట్యూబ్ స్టార్ తొలి స్థానం ద‌క్కించుకున్నాడు. ప్ర‌పంచంలో యూట్యూబ్ ద్వారా అత్య‌ధికంగా ఆదాయాన్ని పొందుతున్న వ్య‌క్తిగా అత‌డు ముందంజ‌లో ఉన్న‌ట్లు పేర్కొంది. గ‌తేడాది 8వ స్థానంలో నిలిచిన రియాన్‌.. ఈ ఏడాది త‌న సంపాద‌న డ‌బుల్ చేసుకున్నాడు.

ఇప్పుడు ఆ యూట్యూబ్‌ మిలియనీర్‌ పేరు రియాన్‌. అందరి పిల్లల్లాగే నచ్చిన బొమ్మలతో ఆడుకుంటూనే మిలియన్ల డబ్బును తన అకౌంట్‌లో వేసుకుంటున్నాడు. అయితే ఈ పిల్లాడు వీడియో కెమెరాల ముందు ఆడుకుంటాడు. కొత్తగా వచ్చే రకరకాల బొమ్మలపై రివ్యూలు ఇస్తుంటాడు. ఆ బొమ్మ‌ల మాదిరిగానే మేక‌ప్ వేసుకుంటాడు. యాంగ్రీ బర్డ్‌, సూపర్‌ హీరో వంటి కార్టూన్‌ టాయ్స్‌, రైళ్లు, విమానాలు ఇలా ఎన్నెన్నో కొత్తగా వచ్చిన పిల్లల బొమ్మలతో ఆడుకుంటాడు. అవి ఎలా ప‌నిచేస్తాయో అందులో వివ‌రిస్తాడు. ఆ వీడియోల్ని త‌న ఛానెల్‌లో పోస్ట్ చేయ‌గా వాటిని కొన్ని లక్షల మంది చూడ‌టం వ‌ల్ల‌ లెక్కలేనన్ని యాడ్స్‌ వచ్చాయి.

ఈ ఏడాదిలో రియాన్ దాదాపు 150 కోట్లు సంపాదించాడు. దీంతో 2018లో యూ ట్యూబ్‌ ద్వారా ఎక్కువ ఆదాయం అందుకున్న వారిలో టాపర్‌గా నిలిచాడు. ఇంటి ద‌గ్గ‌రి నుంచి కోట్లు కొల్ల‌గొడుతున్న చిచ్చ‌ర పిడుగు యూ ట్యూబ్‌ స్టార్‌గా నిలిచి సంచ‌ల‌నం సృష్టించాడు. ప్ర‌స్తుతం రియాన్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 17 మిలియ‌న్లు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌ని వీడియోల‌కు 26 బిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి.

6553
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS