భూగర్భంలో భారీ పర్వతాలు

Mon,February 18, 2019 12:51 PM

Scientists discover mountains in Mantle layer of the Earth

టోక్యో: భూమి ఎలా ఏర్పడింది అన్నదానిపై ఇప్పటివరకు అందరికీ ఒక అంచనా ఉంది. అయితే సైంటిస్టులు తాజాగా వెల్లడించిన సమాచారం ఓ కొత్త చర్చకు దారి తీసింది. సాధారణంగా భూమిలో నాలుగు పొరలు ఉంటాయని అందరికీ తెలుసు. క్రస్ట్.. ఇది భూమి పైభాగం. ఇక్కడే మనం ఉంటున్నది. దాని కింది మాంటిల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్ పొరలు ఉంటాయి. తాజాగా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది ఏంటంటే.. మాంటిల్ పొరలో భారీ పర్వతాలు ఉన్నాయి అని. దీనికోసం ఓ భారీ భూకంపం ఇచ్చిన డేటాను అధ్యయనం చేశారు. బొలీవియాలో 1994లో 8.2 తీవ్రతతో వచ్చిన భూకంపానికి సంబంధించి అధ్యయనం చేస్తే ఈ ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయి.

భూగర్భంలో 660 కిలోమీటర్ల లోపల భారీ పర్వతాలు, మరో భౌగోళిక స్వరూపం ఉన్నట్లు గుర్తించారు. ఈ లేయర్‌కు కచ్చితమైన పేరేదీ లేకపోవడంతో ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు దీనిని ద 660 కిలోమీటర్ బౌండరీగా పిలుస్తున్నారు. అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ, చైనాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోడెసీ అండ్ జియోఫిజిక్స్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం కోసం భూమిపై ఉన్న అత్యంత శక్తివంతమైన తరంగాలను ఉపయోగించారు. భారీ భూకంపాలు వచ్చినపుడు ఈ తరంగాలు ఉత్పన్నమవుతాయి. 7 అంతకన్నా ఎక్కువ తీవ్రతతో వచ్చే భూకంపాలు భూమి లోపల కోర్ వరకు షాక్‌వేవ్స్‌ను పంపిస్తాయి. ఆ వేవ్స్ కింది భాగాన్ని తాకి మళ్లీ పైకి వస్తాయి. దీంతో బొలీవియాలో 8.2 తీవ్రతతో వచ్చిన భూకంపాన్ని ఈ అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్నారు.

భూగర్భంలో తరంగాలు ప్రయాణిస్తున్న తీరును అనుకరించడానికి శక్తివంతమైన కంప్యూటర్లను ఉపయోగించారు. కాంతి ఏదైనా ఒక దర్పణం గుండా వెళ్లినపుడు ఎలా అయితే వంగి ప్రయాణిస్తాయో.. భూకంప తరంగాలు కూడా భూగర్భంలో ఏవైనా అడ్డంకులు వచ్చినపుడు వంగి ప్రయాణించినట్లు గుర్తించారు. ఈ డేటా ఆధారంగా భూగర్భంలో 660 కిలోమీటర్ల లోతున భారీ పర్వతాలు ఈ తరంగాలను అడ్డుకున్నట్లు తేలింది. మనం ఇప్పుడు జీవిస్తున్న భూపొర కంటే ఎంతో గరుకుగా 660 కిలోమీటర్ బౌండరీ ఉందని ఈ అధ్యయనం పాల్గొన్న సైంటిస్టు వెంబో వు వెల్లడించారు. బండరాళ్లతో కూడిన పర్వతాల కంటే బలమైన భౌగోళిక స్వరూపం అక్కడ ఉందని ఆయన తెలిపారు.

1862
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles