రష్యా: గృహ హింస, లైంగికవేధింపులకు పాల్పడుతున్న తండ్రిని చంపిన కూతుళ్లకు హత్య జైలుశిక్ష పడుతుందా..? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. కొన్నేళ్లుగా తమను వేధిస్తున్న తండ్రి మిఖైల్ ను 2018 జులైలో అతని కూతుళ్లు క్రిస్టినా, ఎంజెలినా, మరియా ఖచతుర్యన్ కలిసి కత్తి, సుత్తితో దాడి చేసి హత్య చేశారు. దీంతో వారిపై కేసు నమోదైంది. హత్య చేసిన సమయంలో ముగ్గురమ్మాయిల వయస్సు 17,18,19. ఈ ఘటనపై రష్యాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.
తండ్రి చేతిలో వేధింపులకు గురైన అమ్మాయిలకు మానసిక చికిత్స అందించాలని డిమాండ్లు వచ్చాయి. అయితే రష్యాలో గృహ హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు కఠిన చట్టాలు లేవు. తరచూ వేధింపుల ఘటనలు జరుగుతున్నా..అధికారులు చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురిలో క్రిస్టినా, ఎంజెలినాకు హత్య చేసేటపుడు..తాము చేస్తుంది నేరమని అవగాహన ఉందని విచారణ కమిటీ తెలిపింది. వీరిలో మరియా (చిన్నసోదరి)కు మాత్రం మానసిక చికిత్స అవసరమని దర్యాప్తు బృందం సభ్యులు పేర్కొన్నారు.
ముగ్గురు కూతుళ్లు వారి ప్రాణాలను రక్షించుకునేందుకు ఆత్మరక్షణలో భాగంగానే తండ్రిని చంపారని, అందువల్ల్ల ఈ కేసు విచారణ వరకు కూడా వెళ్లదని పలువురు లాయర్లు, సామాజిక వేత్తలు పేర్కొంటున్నారు. ఒకవేళ చట్ట ప్రకారం ముగ్గురు అక్కాచెల్లెళ్లు నేరస్థులుగా తేలితే గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముందట. మరి ఈ కేసులో ముగ్గురికి శిక్ష పడుతుందా..లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.