ముషారఫ్‌కు షాక్.. ఎన్నికల్లో పోటీకి దూరం

Thu,June 14, 2018 04:34 PM

Pakistan Supreme Court bars Parvez Musharraf from contesting in General Elections

ఇస్లామాబాద్: పాకిస్థాన్ సుప్రీంకోర్టు మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు షాకిచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. ఇంతకుముందు షరతులతో కూడిన అనుమతి ఇచ్చినా.. కోర్టులో హాజరు కాని కారణంగా అసలు పోటీ చేయకూడదని ఆదేశించింది. పాకిస్థాన్‌లో జులై 25న ఎన్నికలు జరగనున్నాయి. గతంలో కోర్టు అనుమతించడంతో ముషారఫ్ తన నామినేషన్‌ను కూడా దాఖలు చేశారు. ఆయనపై జీవితకాల నిషేధం విధించిన పెషావర్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది.

ఇదే కేసుకు సంబంధించి జూన్ 13లోపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ముషారఫ్ మాత్రం హాజరు కాలేదు. బుధవారం దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ సాఖిబ్ నిసార్.. ముషారఫ్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయనకు మరో అవకాశం ఇచ్చి గురువారం మధ్యాహ్నం రెండు గంటల లోపు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ముషారఫ్ తిరిగి రావాలని అనుకుంటున్నా.. ఇంత త్వరగా కుదరదని ఆయన తరఫు లాయర్ ఖమర్ అఫ్జల్ వాదించారు. రంజాన్ పండుగతోపాటు అనారోగ్య కారణంగా ఆయన రాలేకపోతున్నారని, మరింత సమయం కావాలని కోరారని అఫ్జల్ కోర్టుకు చెప్పారు.

దీంతో చీఫ్ జస్టిస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణను నిరవధికంగా వాయిదా వేశారు. పిటిషనర్ ఎప్పుడు సిద్ధంగా ఉంటే అప్పుడే విచారణ జరుపుతానని స్పష్టంచేశారు. అదే సమయంలో ముషారఫ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. ముషారఫ్ 2016, మార్చి నుంచి దుబాయ్‌లోనే ఉంటున్నారు. తన హయాంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన కారణంగా దేశ ద్రోహం కేసు ఎదుర్కొంటున్నారు.

1689
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles