అందుకే.. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌ను ఏ దేశం ప్ర‌శ్నించ‌లేదు!

Mon,June 26, 2017 12:19 PM

No country questioned Indias Surgical Strikes on PoK says Narendra Modi

వాషింగ్ట‌న్‌: అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదంపై ఘాటుగా స్పందించారు. శాంతిని, సాధార‌ణ జీవితాన్ని నాశ‌నం చేస్తున్న ఉగ్ర‌వాద నిజ‌స్వ‌రూపాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్ప‌డంలో భార‌త్ విజ‌య‌వంత‌మైందని మోదీ అన్నారు. అందుకే పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై స‌ర్జిక‌ల్ దాడులు చేసిన‌ప్పుడు ఏ దేశం భార‌త్‌ను ప్ర‌శ్నించ‌లేద‌ని ఆయ‌న చెప్పారు. వ‌ర్జీనియాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఇండియ‌న్‌-అమెరిక‌న్స్‌ను ఉద్దేశించి మోదీ ప్ర‌సంగించారు. త‌న‌ను తాను ర‌క్షించుకోవ‌డానికి ఇండియా ఎంత‌వ‌ర‌కైనా వెళ్తుంద‌ని స‌ర్జిక‌ల్ దాడుల ద్వారా నిరూపిత‌మైంద‌ని మోదీ స్ప‌ష్టంచేశారు. 20 ఏళ్ల కింద‌ట మేము ఉగ్ర‌వాదం గురించి మాట్లాడిన‌పుడు ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. అది శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య అన్నారు. కానీ ఇప్పుడు ఉగ్ర‌వాదులే ప్ర‌పంచానికి ఉగ్ర‌వాద‌మంటే ఏంటో చూపించారు అని ప్ర‌ధాని అన్నారు.

స‌ర్జిక‌ల్ దాడుల‌తో ఇండియా స‌త్తా ఏంటో ప్ర‌పంచానికి తెలిసింది. నిగ్ర‌హంగా ఉండే భార‌త్‌.. అవ‌స‌ర‌మైతే త‌న స‌త్తా చాటుతుంద‌ని, ఉగ్ర‌వాదం నుంచి త‌న‌ను తాను ర‌క్షించుకోవ‌డం ఎలాగో తెలుస‌ని ప్ర‌పంచం గుర్తించింది అని మోదీ అన‌డంతో అక్క‌డి ఆడిటోరియం చ‌ప్ప‌ట్లతో మార్మోగింది. స‌ర్జిక‌ల్ దాడుల‌ను ఏ దేశం ప్ర‌శ్నించ‌లేద‌ని, దాని బారిన ప‌డిన దేశం సంగ‌తి వేరే అని చెప్ప‌డంతో అక్క‌డున్న‌వారంతా ఒక్క‌సారిగా న‌వ్వారు. ఇక చైనా ల‌క్ష్యంగా కూడా మోదీ విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌న ల‌క్ష్యాల‌ను అందుకోవ‌డానికి ప్ర‌పంచ ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌తీసే సంస్కృతి ఇండియాకు లేద‌ని మోదీ అన్నారు. ద‌క్షిణ చైనా స‌ముద్రం విష‌యంలో చైనా అనుస‌రిస్తున్న తీరుపై ఆయ‌న ఇలా స్పందించారు. అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌కు లోబ‌డే ఇండియా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని, వ‌సుధైక కుటుంబం అన్న ఆద‌ర్శాన్ని తాము పాటిస్తామ‌ని మోదీ స్ప‌ష్టంచేశారు.

1304
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS