పాకిస్థాన్‌కు క్లాస్ పీకిన చైనా!

Thu,February 28, 2019 12:36 PM

బీజింగ్: పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడి చేసిన తర్వాత కూడా చైనా సహా ఏ దేశం తమకు అండగా నిలవలేదని పాక్ మాజీ రాయబారి ఒకరు ఆవేదన చెందారు. ఇప్పుడు మరోసారి పాక్‌కు అలాంటి అనుభవమే ఎదురైంది. ఈ దాడి తర్వాత పాకిస్థాన్ భారత గగనతలంలోకి వచ్చి.. మన మిలిటరీ స్థావరాలపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీనిని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సమర్థంగా తిప్పికొట్టింది. పాక్‌కు చెందిన ఓ ఎఫ్ 16 విమానాన్ని కూడా కూల్చేసింది. ఈ ఘటనను వివరించేందుకు తన మిత్ర దేశం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యికి బుధవారం అర్ధరాత్రి అత్యవసరంగా ఫోన్ చేశారు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ. అయితే చైనా స్పందన చూసి ఆయన షాక్ తిన్నారు. భారత గగనతలంలోకి పాక్ దూసుకెళ్లడాన్ని తప్పుబట్టేట్లుగా వాంగ్ యీ మాట్లాడారు. అన్ని దేశాల సార్వభౌమాధికారం, సమగ్రతను గౌరవించాల్సిన అవసరం ఉందని చైనా భావిస్తున్నదని వాంగ్.. ఖురేషీకి స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన రూపంలో విడుదల చేసింది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించే చర్యలను చైనా సహించబోదని కూడా ఈ సందర్భంగా ఖురేషీకి వాంగ్ స్పష్టంగా చెప్పినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నిజానికి బాలాకోట్‌లో ఐఏఎఫ్ దాడి తర్వాత దానికి దారి తీసిన పరిణామాలను చైనాతోపాటు వివిధ దేశాలకు భారత్ వివరించింది.

9672
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles