ఓ వ్యక్తి ప్రాణం కాపాడిన సెల్ ఫోన్.. ఎలాగంటే?

Sat,March 16, 2019 07:38 PM

సెల్‌ఫోన్.. ఇప్పుడు ఇదే కదా మనుషులను బిజీబిజీగా గడిపేలా చేస్తోంది. స్మార్ట్‌ఫోన్లు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడే ఈ జనరేషన్ లైఫ్ స్టయిలే మారిపోయింది. మామూలుగా కాదు. వాళ్ల ఆలోచనా విధానం కానీ.. ఇతర అలవాట్లు కానీ.. అన్నీ మారిపోయాయి. ఇప్పుడు అంతా ఊహా ప్రపంచంలో బతకడమే. అయితే.. చాలామంది స్మార్ట్‌ఫోన్లు మనుషులకు లేనిపోని సమస్యలు తీసుకొస్తున్నాయని మొత్తుకుంటున్నారు కదా. కానీ.. ఈ వార్త చదివితే మీరు ఫోన్ల వల్ల ఇటువంటి లాభాలు కూడా ఉన్నాయా అని ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే.. ఓ సెల్‌ఫోన్ ఓ వ్యక్తి ప్రాణం కాపాడింది. గ్రేట్ కదా. మనిషికి ప్రాణం కంటే విలువైంది ఏముంటుంది చెప్పండి. అదంతా ఓకే కానీ.. అసలు సెల్‌ఫోన్ మనిషి ప్రాణాన్ని ఎలా కాపాడింది.. అనే డౌట్ మీకు ఇప్పటికే వచ్చి ఉంటుంది. అది తెలుసుకోవాలంటే మనం ఓసారి ఆస్ట్రేలియా వెళ్లి రావాలి.

సెల్‌ఫోన్ ఓ మనిషి ప్రాణం కాపాడిందంటే చాలామంది ఏమనుకుంటారంటే.. ఆ వ్యక్తి ప్రమాద సమయంలో సెల్‌ఫోన్ నుంచి పోలీసులకో లేక అంబులెన్స్‌కో ఫోన్ చేసి ఉంటాడు అని అనుకుంటారు. కానీ.. అది కానే కాదు. తనపై విల్లు ఎక్కుపెట్టి బాణంతో షూట్ చేయబోయిన వ్యక్తిని ఆపడానికి తన ఫోన్‌ను అడ్డం పెట్టాడు ఆ వ్యక్తి. ఆ బాణం వచ్చి అతడి ఫోన్‌కు గుచ్చుకోవడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. అయితే.. బాణం ఫోన్‌కు గుచ్చుకున్నప్పుడు ఫోన్ ఎగిరి ఆ వ్యక్తి దవడకు తాకింది. కాకపోతే అది అంత పెద్ద దెబ్బ కాదు. చిన్నదే.


ఈ ఘటన ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌లో ఉన్న నింబిన్ ప్రాంతంలో చోటు చేసుకున్నది. 43 ఏళ్ల ఓ వ్యక్తి కారులో బయటికి వెళ్లాడు. ఓ చోట ఆగాడు. కారు దిగాడు. అదే సమయంలో కొంచెం దూరంలో తనకు తెలిసిన ఓ వ్యక్తి అక్కడే ఉన్నాడు. అతడి దగ్గర విల్లు ఉంది. వెంటనే ఆ వ్యక్తి తన విల్లును తీసి కారు నుంచి దిగిన వ్యక్తికి ఎక్కుపెట్టాడు. ఇంతలోనే ఆ వ్యక్తి తన సెల్‌ఫోన్‌ను తీసి విల్లు ఎక్కుపెట్టిన వ్యక్తి ఫోటో తీద్దామనుకున్నాడు. అంతలోనే బాణం వచ్చి అతడి ఫోన్‌ను గుచ్చుకుంది. కొంచెం అటూ ఇటూ అయినా ఆ బాణం అతడి శరీరంలో దిగేది. ఫోన్ ఎగిరి అత‌డి ద‌వ‌డ‌ను తాక‌డం వ‌ల్ల అత‌డికి చిన్న గాయం అయింది అంతే. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టిన న్యూ సౌత్ వేల్స్ పోలీసులు విల్లుతో దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. ఈ ఘటనను పోలీసులు తమ ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆ పోస్టు కాస్త వైరల్‌గా మారింది.

27099
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles