కేరళ వరద బాధితులపై జోకులేశాడని..

Mon,August 20, 2018 02:04 PM

Man fired from Job after made fun of Kerala Flood victims

మస్కట్: ఓవైపు వందేళ్లలో ఎన్నడూ లేనంత వర్షాలు, వరదలతో కేరళ బిక్కుబిక్కుమంటున్నది. సాటి రాష్ట్రం కష్టాల్లో ఉన్నదని దేశంలోని రాష్ర్టాలన్నీ స్పందించి పెద్ద మనసుతో కేరళకు సాయం చేస్తున్నాయి. సెలబ్రిటీలు, సాధారణ జనం కూడా మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో కేరళకే చెందిన రాహుల్ చెరు పలయట్టు అనే వ్యక్తి వరద బాధితులపై జోకులేశాడు. ఒమన్‌లోని లులు గ్రూప్ ఇంటర్నేషనల్‌లో పనిచేస్తున్న రాహుల్.. కేరళ వరద బాధితుల పారిశుద్ధ్య అవసరాల కోసం చేసిన ఓ ఫేస్‌బుక్ పోస్ట్‌ను హేళన చేస్తూ కామెంట్ చేశాడు. దీనిపై సీరియస్‌గా స్పందించిన లులు గ్రూప్.. అతన్ని వెంటనే ఉద్యోగంలో నుంచి తీసేసింది.

కేరళ వరదలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నిన్ను వెంటనే ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాం అని ఒమన్‌లోని లులు గ్రూప్ హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్ రాహుల్‌కు స్పష్టంచేసింది. అయితే దీనిపై రాహుల్ పబ్లిగ్గా క్షమాపణ చెప్పాడు. ఆ కామెంట్ చేసిన సమయంలో తాను తాగిన మత్తులో ఉన్నానని, అది అంత పెద్ద తప్పిదమని తనకు తెలియదని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియోలో అతను చెప్పాడు. ఇలాంటి సున్నితమైన అంశాలపై అనుచిత వ్యాఖ్యలను తమ సంస్థ సహించబోదని కంపెనీ సీసీవో నందకుమార్ స్పష్టంచేశారు. లులు గ్రూప్ వ్యవస్థాపకుడు యూసుఫ్ అలీ కూడా కేరళకు చెందిన వ్యక్తే. దీంతో కేరళ వరద బాధితుల కోసం ఆయన ఇప్పటికే రూ.170 కోట్లు విరాళంగా ఇచ్చారు.

3606
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles