వాషింగ్టన్: పాక్ దగ్గర బందీగా ఉన్న భారత పైలట్ అభినందన్‌ను విడిచిపెట్టాలని ఆ దేశ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మనవరాలు, రచయిత్రి ఫాతిమా భుట్టో కోరారు. బుధవారం అభినందన్ నడుపుతున్న మిగ్ 21 విమానాన్ని కూల్చేసి అతన్ని పాకిస్థాన్ బందీగా చేసుకున్న సంగతి తెలిసిందే. అతన్ని వెంటనే, సురక్షితంగా విడిచిపెట్టాలని ఇండియా డిమాండ్ చేస్తున్నా.. పాకిస్థాన్ మాత్రం ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఇప్పుడు ఫాతిమా కూడా అదే కోరుతున్నది. మన దేశం శాంతి, మానవత్వానికి కట్టుబడి ఉంటే.. ఆ పైలట్‌ను వెంటనే విడిచిపెట్టాలని నాతోపాటు ప్రతి పాక్ యువత కోరుకుంటున్నట్లు ఫాతిమా చెప్పింది. న్యూయార్క్ టైమ్స్ పత్రికకు రాసిన ఆర్టికల్‌లో ఫాతిమా ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది.
మేం మా జీవితం మొత్తం యుద్ధంలోనే గడిపాం. పాకిస్థాన్ సైనికులు మరణించడాన్ని నేను చూడలేను. అలాగే భారతీయ సైనికులు కూడా. మనది అనాథల ఉపఖండంగా మారాలని నేను కోరుకోవడం లేదు అని ఫాతిమా భుట్టో అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కోసం నా తరం పాకిస్థానీలు పోరాడారు. ఇప్పుడు అత్యవసరమైన శాంతి కోసం మా గళం వినిపించాల్సిన అవసరం ఉంది అని ఫాతిమా స్పష్టం చేసింది. మిలిటరీ నియంతృత్వం, ఉగ్రవాదం, అస్థిరతను భరించే స్థితిలో ఇప్పటి పాకిస్థాన్ యువత లేదని ఆమె చెప్పడం విశేషం. ఉద్రిక్తతలు తగ్గాలనే తనతోపాటు చాలా మంది పాక్ యువత కోరుకుంటున్నదని ఫాతిమా చెప్పింది. బుధవారం పాకిస్థాన్‌లో సే నో టు వార్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో నంబర్ వన్ స్థానంలో నిలవడం విశేషం. పాక్ యువత అసలు యుద్ధం వద్దనే బలంగా కోరుకుంటున్నది.