నాయకులను తిడితే జైలే!

Thu,March 15, 2018 10:14 PM

Indonesian jail leaders scolding

జకార్త: ప్రపంచంలో మూడో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండోనేషియాలో అమలులోకి వచ్చిన ఓ చట్టం తీవ్ర విమర్శలపాలవుతున్నది. నూతన చట్టం ప్రకారం జాతీయస్థాయి రాజకీయ నాయకులను గనుక సాధారణ పౌరులు విమర్శిస్తే జైలు శిక్ష విధించేలా నిబంధనలను రూపొందించారు. దేశంలో ప్రజస్వామ్య విలువలకు ఇది గొడ్డలిపెట్టు లాంటిదని ప్రజాస్వామ్యవాదులు ఆరోపిస్తున్నారు. గత నెలలో చట్టసభ ఆమోదం పొందిన ఈ బిల్లు ప్రస్తుతం కార్యరూపం దాల్చింది. ఈ బిల్లుపై సంతకం చేసేందుకు మొదట అధ్యక్షుడు జోకో విడోడో అభ్యంతరం వ్యక్తంచేసినప్పటికీ ఆయనకు వీటో అధికారం లేకపోవడంతో బిల్లును అడ్డుకోలేకపోయారు. అయితే దీనిని రాజ్యాంగ కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉన్నది. ఈ చట్టం ప్రకారం పార్లమెంట్ పట్ల లేదా సభ్యులపట్ల అగౌరవంగా మాట్లాడినా, ప్రవర్తించినా సదరు వ్యక్తులపై కేసులు నమోదుచేయవచ్చు. ఈ నేరం కింద కనిష్ఠంగా, గరిష్ఠంగా ఎన్నేండ్లు జైలు శిక్ష విధించాలనే నిబంధనలను మాత్రం రూపొందించలేదు. దీంతో నేరం రుజువైతే భారీ శిక్షలు పడే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన ఆందోళనకారులు భవిష్యత్తులో మళ్లీ అలాంటి ఆందోళనలు నిర్వహిస్తే జైలుకు వెళ్లే అవకాశం ఉన్నదని నిపుణులు పేర్కొంటున్నారు.

2318
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles