వయసు 20 ఏండ్లు తగ్గించమని కోర్టుకు వెళ్లాడు

Thu,November 8, 2018 07:44 PM

he prays court to reduce his age by 20 years

60లో 20 అని సరదాగా అంటుంటారు. పెద్దవయసులో దోరవయసు చిలిపికోర్కెలు వెల్లడించుకునేవారి మీద వేసే ఓ చురక అది. కానీ తన వయసు అంటే.. ఆ అంకె ఓ గుదిబండగా మారిందని ఓ పెద్దాయన తెగ బాధపడిపోతున్నాడు. కనీసం ఓ ఇరవై ఏళ్లన్నా చట్టం ప్రకారం తగ్గించమని కోర్టును ప్రాధేయపడుతున్నాడు. డచ్ పర్సనాలిటీ గురు ఎమిల్ రాటెల్‌బ్యాండ్ గొడవ ఇది. తన వయసు 69. కానీ 20 తగ్గించి 49 అని సర్టిఫికెట్ ఇమ్మని ఆయన కోరిక. దీని వెనుక శానా కారణాలున్నాయని కోర్టుకు చెప్పుకున్నాడు. నెదర్లాండ్స్‌లోని ఆర్న్‌హెమ్ స్థానిక న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరుగుతున్నది. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ రంగంలో పేరున్న రాటెల్‌బ్యాండ్ ఈ కేసుతో వార్తలకెక్కాడు.

డాక్టర్లు తన శారీరక, మానసిక వయసు 45 సంవత్సరాలే అని చెప్పారట. 69 అని డేటింగ్ సైట్లలో పెడితే స్పందన రావడం లేదు. తన ఆకారానికి 49 సంవత్సరాల వయసు జోడిస్తే కుప్పతెప్పలుగా వస్తాయని అంటున్నాడు. మనిషి దిట్టంగా ఉన్నాడు. పర్సనాలిటీ కోర్సులు, కౌన్సెలింగ్‌లతో బోలెడు డబ్బు సంపాదించాడు. ఇంకా సంపాదిస్తున్నాడు. కానీ అప్పుడే 69 అని తనను పక్కనపెట్టడం జరుగుతున్నదని తెగబాధపడిపోయాడు. పుట్టిన తేదీని మార్చమనేది ఆయన ప్రధానమైన విజ్ఞాపన. మరీ అంత పాతరోజుల్లో పుట్టానా అని చిరాకు పుడుతోందట. తన పుట్టిన తేదీ 11 మార్చి 1949. దానిని 11 మార్చి 1969గా మార్చమంటున్నాడు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గుర్తింపు పత్రాల్లో లింగమార్పిడి అనేది చట్టపరంగా సాధ్యమేనని, పుట్టినతేదీ మార్పిడి అనేది ఇంతదాకా చట్టంలో ఎక్కడా తారసపడలేదని జడ్జి చెప్పారు. పుట్టిన తేదీ మారిస్తే కనిపెంచిన తల్లిదండ్రులు బాధపడతారు కదా అని కూడా జడ్జిగారు సెంటిమెంటును టచ్ చేశారు. దానికీ రాటెల్‌బ్యాండ్ నా తల్లిదండ్రులు చనిపోయారు కనుక ఆ ప్రశ్న తలెత్తదని రెడీగా సమాధానమిచ్చాడు. కావాలంటే పెన్షన్ ఆపేసుకోమని కూడా అంటున్నాడు. 45 నిమిషాల విచారణ చివరన ఇది స్వేచ్ఛకు సంబంధించిన అంశమని వాదించాడు.

6196
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles