చవకగా పెట్రోల్ కావాలా? అయితే చలో నేపాల్!

Wed,September 19, 2018 04:15 PM

full-tank tourism flourishes with nepal

భారత్‌లో చమురు ధరల పెంపుతో నేపాల్‌కు టూరిస్టుల వరద పెరుగుతున్నదట. రెండింటికీ ఏమిటి సంబంధం అంటారా? ఉత్తరాఖండ్, యూపీ, బిహార్ రాష్ర్టాలు నేపాల్ సరిహద్దులను ఆనుకునే ఉంటాయి. మంగళవారం ఉత్తరాఖండ్‌లోని ఉధంసింగ్‌నగర్, చంపావత్ జిల్లాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.82.63 ఉండగా డీజిల్ ధర రూ.74.90గా ఉంది. అదే పొరుగున ఉన్న నేపాల్‌లోని కంచన్‌పూర్ జిల్లాలో రూ.68.20, రూ.58.30గా ఉంది. లీటరుకు రూ.14 రూపాయలు తేడా ఉంటున్నది. దాంతో జనం పొలోమని నేపాల్‌కు వెళ్తున్నారు. నేపాల్‌కు వెళ్లేందుకు భారతీయులకు పాస్‌పోర్టు, వీసాలు అవసరం లేదు. వాహనదారులు, ముఖ్యంగా ట్యాక్సీలు, టూవీలర్ నడిపేవారు నేపాల్‌కు బారులు కడుతున్నారు. ఫుల్‌ట్యాంక్ చేయించుకుని తిరిగివస్తున్నారు. దీనిని సరదాగా ఫుల్‌ట్యాంక్ టూరిజం అని పిలుస్తున్నారు. కొందరు సొంతానికి చమురును వాడుకుంటుంటే మరికొందరు ఎక్కువ ధరకు అమ్మకుంటున్నారు. అటు నేపాలీ చమురు కంపెనీలు జోరుగా వ్యాపారం సాగుతున్నందుకు సంతోషిస్తున్నారు. ఇటు ఇండియాలోని బంకులు బోసిపోయిన కనిపిస్తున్నాయి. విడిగా చమురు దొంగరవాణా చేస్తే పట్టుకోవచ్చు. కానీ వాహనాల ట్యాంకుల్లోని చమురుపై ఎలాంటి చర్య తీసుకునే అవకాశం లేదు. ఇప్పటికిప్పుడు నేపాల్‌కు రాకపోకలపై నిషేధం విధించే అవకాశం అంతకంటే లేదు. బీహార్‌లోని మోతిహారీ, అరారియా, మధుబని, సీతామడి, యూపీలోని బారేచ్ జిల్లాల్లో ఈ తరహా ఫుల్‌ట్యాంక్ టూరిజం ఎక్కువగా కనిపిస్తున్నది. మొత్తంమీద ఈ అక్రమరవాణా యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు.

3084
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS