యాపిల్‌ను విమానంలో తీసుకెళ్లినందుకు రూ. 33 వేల ఫైన్!

Mon,April 23, 2018 04:56 PM

Free Apple Ended Up Costing This Woman $500 by US Custom officials

ఏమండోయ్.. ఇది విన్నారా? ఒక యాపిల్ ధర ఎంతుంటుంది? మా అంటే 20 రూపాయలు.. సరే.. 30, 40 రూపాయలు వేసుకోండి. కాని.. ఓ మహిళ యాపిల్‌ను విమానంలో తీసుకెళ్లిందని కస్టమ్స్ అధికారులు ఆమెకు ఏకంగా 500 డాలర్ల ఫైన్ వేశారు. అంటే మన కరెన్సీలో సుమారు 33 వేల రూపాయలు. వామ్మో.. ఇదేం విడ్డూరం అంటారా? ఏంటో కాస్త వివరంగా తెలుసుకుందాం పదండి.క్రిస్టల్ టాడ్‌లాక్ అనే మహిళ పారిస్ నుంచి యూఎస్‌లోని మిన్నేపోలిస్‌కు వెళ్లాలి. అయితే.. పారిస్‌లో డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానాన్ని ఎక్కింది. అయితే.. ఆ విమానంలో యాపిల్‌ను స్నాక్‌గా ఫ్రీగా ఇస్తారట. క్రిస్టల్‌కు కూడా అలాగే ఇచ్చారు. దీంతో క్రిస్టల్ యాపిల్‌ను తీసి తన బ్యాగ్‌లో వేసుకుంది. సర్లే.. తర్వాత తిందాం అనుకుంది. అదే తన కొంప ముంచింది.


మిన్నేపోలిస్‌లో విమానం దిగిన క్రిస్టల్ డెన్వెర్ వెళ్లడం కోసం మరో విమానం ఎక్కడానికి వెళ్లబోయింది. ఇంతలో కస్టమ్స్ అధికారులు తన బ్యాగ్‌ను చెక్ చేశారు. అందులో ఈ ఫ్రీ యాపిల్ ఉంది. ఆ యాపిల్ కవర్ మీద డెల్టా లోగో ఉంది. దీంతో కస్టమ్స్ అధికారులు ఆ మహిళకు 500 డాలర్ల ఫైన్ వేశారు. అంతే కాదు.. తన గ్లోబల్ ఎంట్రీని కూడా ఆపేశారట. ఒక్కసారిగా షాక్ తిన్న క్రిస్టల్‌కు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అసలు విషయం ఏంటంటే... విమానంలో ఇచ్చిన యాపిల్‌ను అందులోనే తినేయాలి. యూఎస్ కస్టమ్స్ రూల్స్ ప్రకారం.. అగ్రికల్చర్‌కు సంబంధించిన ఏ వస్తువులైనా వేరే దేశం నుంచి విమానంలో యూఎస్‌కు తీసుకురావాలంటే ఆ దేశం తరుపున డిక్లరేషన్ తప్పనిసరి. ఎందుకంటే.. వేరే దేశం నుంచి వచ్చే అగ్రికల్చర్ వస్తువులకు ఉండే బ్యాక్టీరియా, జంతువులైతే వాటి వల్ల వచ్చే వ్యాదులు యూఎస్‌లో ప్రవేశించకుండా ఉండటానికే ఈ రూల్స్. డెల్టా ఎయిర్‌లైన్స్ అందించిన ఆ యాపిల్.. పారిస్‌ది కాబట్టి.. అందుకే క్రిస్టల్ దాన్ని తినకుండా బ్యాగులో వేసుకొని అడ్డంగా బుక్కయిపోయింది.


ఇక.. డెల్టా ఎయిర్‌లైన్స్ యాపిల్‌తో పాటు ఇచ్చిన లోగో ఉన్న కవర్‌ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి తన బాధను వెల్లగక్కింది. దీంతో ఆమెకు నెటిజన్లు సానుభూతి తెలియజేస్తున్నారు.

5351
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS