బాబోయ్.. మా అబ్బాయికి అంత కట్నం ఇచ్చుకోలేం..!

Mon,September 24, 2018 03:24 PM

Chinas increasing Bride Price worries Grooms parents

బీజింగ్: మన దేశంలో ఒకప్పుడు కన్యాశుల్కం ఉండేది.. అంటే అమ్మాయికి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు అది కాస్తా వరకట్నంగా మారింది. కానీ చైనాలో మాత్రం ఇప్పటికే కన్యాశుల్కమే నడుస్తున్నది. ప్రపంచంలో ఏ దేశంలో లేనట్లుగా చైనాలో అమ్మాయిలకు తీవ్ర కొరత ఉంది. అక్కడ లింగ భేదం విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుత లెక్కల ప్రకారం చైనాలో అమ్మాయిల కంటే అబ్బాయిల సంఖ్య మూడు కోట్ల వరకు ఎక్కువగా ఉంది. దీంతో పెళ్లి కోసం అమ్మాయిలు దొరక్క అబ్బాయిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాన్స్ దొరికిందే తడువుగా అమ్మాయిల తల్లిదండ్రులు కట్నం దండుకుంటున్నారు. కట్నాలను విపరీతంగా పెంచేస్తున్నారు. సగటును 38 వేల డాలర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇది అక్కడి అబ్బాయిల సగటు ఏడాది జీతం కంటే ఐదు రెట్లు ఎక్కువ కావడం విశేషం.

నగదుతోపాటు పెళ్లికూతురు తల్లిదండ్రులకు ఇల్లు లేదా ఇతర బహుమానాలు అదనం. దీంతో అబ్బాయిల తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. మా అబ్బాయికి అంత కట్నం చెల్లించుకోలేం బాబోయ్ అంటూ మొరపెట్టుకుంటున్నారు. దీంతో కట్నాన్ని 2900 డాలర్ల కంటే ఎక్కువ తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకన్నా ఎక్కువ తీసుకుంటే మానవ అక్రమ రవాణా కింద కేసు పెడతామని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎన్నో శతాబ్దాలుగా చైనాలో ఈ కన్యాశుల్కం కొనసాగుతున్నది. అమ్మాయిల సంఖ్య తగ్గిపోతున్నకొద్దీ కట్నం భారీగా పెరిగిపోతున్నది. గతంలో ఒకే సంతానం అన్న చైనా విధానం ఇప్పుడు అబ్బాయిల తల్లిదండ్రుల పట్ల శాపంగా మారింది. అప్పట్లో ఆ ఒక్క సంతానం అబ్బాయి అయితేనే బాగుంటుందని చాలా మంది అమ్మాయి అని తెలవగానే అబార్షన్ చేయించడం, పుట్టగానే చంపేయడం లేదా వదిలేయడం చేశారు. దీంతో దేశంలో అమ్మాయిలకు తీవ్ర కొరత ఏర్పడింది.

2016లో ఈ ఒకే సంతానం నిబంధనను చైనా సడలించింది. మరీ గ్రామీణ ప్రాంతాల్లో అయితే అమ్మాయిలకు భారీ డిమాండ్ ఏర్పడింది. వాళ్లు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇచ్చి పెళ్లి చేసుకోవడం తప్ప అబ్బాయిలకు మరో మార్గం లేకుండా పోతున్నది. చైనా ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతుండటంతో గ్రామాల్లోని అమ్మాయిలు మంచి ఉద్యోగాల కోసం సిటీలకు వెళ్తున్నారు. అక్కడి నుంచి తిరిగి రావడం లేదు. దీంతో గ్రామాల్లో అమ్మాయిల కొరత మరీ ఎక్కువగా ఉంటున్నది. ఇదంతా గమనించిన చైనాలోని డాన్‌లియూ అనే గ్రామ పెద్దలు ఇలా కన్యాశుల్కంపై ప్రత్యేకంగా పరిమితులు పెట్టాలన్న ఆలోచన చేశారు. బీజింగ్ నుంచి ఓ నాలుగు గంటల పాటు డ్రైవ్ చేస్తూ వెళ్తే వచ్చే ఊరిది. చైనాలో వేల సంఖ్యలో ఊళ్ల పరిస్థితి ఇలాగే ఉంది. ఇలా కన్యాశుల్కంపై పరిమితులు విధించడాన్ని అబ్బాయిల తల్లిదండ్రులు స్వాగతిస్తుంటే.. అమ్మాయిల తల్లిదండ్రులు మాత్రం తప్పుబడుతున్నారు.

7243
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles