కష్టాల్లో చైనా.. 28 ఏళ్ల కనిష్ఠానికి జీడీపీ వృద్ధిరేటు

Mon,January 21, 2019 01:10 PM

Chinas growth rate at 28 years low reveals latest Data

బీజింగ్: అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచాన్నే ఏలుదామని చూస్తున్న చైనా ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో పడింది. గతేడాది చైనా ఆర్థిక వృద్ధి 28 ఏళ్ల కనిష్ఠాన్ని తాకింది. పెట్టుబడులు బలహీనపడటం, అమెరికాతో వాణిజ్య యుద్ధం చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. గతేడాది చైనా వృద్ధిరేటు 6.6 శాతంగా ఉన్నట్లు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. ప్రపంచ వృద్ధిలో ఈ మధ్య దాదాపు మూడో వంతు సాధించిన చైనా.. ఇప్పుడు తిరోగమనంలో ఉండటం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు మరింత పతనమవనున్నట్లు వాళ్లు స్పష్టం చేస్తున్నారు. గతేడాది చివరి త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు కేవలం 6.4 శాతంగా ఉంది.

అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత ఇదే అత్యల్ప వృద్ధి రేటు కావడం విశేషం. ఇది మూడో త్రైమాసికంలో 6.5 శాతంగా ఉంది. నాలుగో త్రైమాసికం వృద్ధి రేటు తగ్గడంతో అది ఓవరాల్‌గా 2018లో చైనా వృద్ధి రేటును 6.6 శాతానికి పరిమితం చేసింది. 1990 తర్వాత ఇంత తక్కువ వృద్ధి రేటు సాధించడం ఇదే తొలిసారి. ఓవైపు అమెరికాతో వాణిజ్య యుద్ధం.. మరోవైపు దేశంలో ఆర్థిక కార్యకలాపాలు బలహీనపడటం, నిరుద్యోగం పెరిగిపోతుండటం వృద్ధి రేటు మందగించడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది వృద్ధి రేటు 6.3 శాతానికి పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత మెల్లగా కోలుకునే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. నిజానికి అధికారిక డేటా కంటే కూడా వాస్తవిక వృద్ధి రేటు మరింత దారుణంగా ఉన్నట్లు నిపుణులు చెప్పారు.

2040
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles