భారతీయ ఆధ్యాత్మిక ప్రచారాలపై చైనా హెచ్చరిక

Thu,January 17, 2019 06:59 PM

భారతీయ మతకేంద్రాలు నడిపే ఆధ్యాత్మిక కోర్సుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చైనా తన పౌరులను హెచ్చరించింది. కొందరు ఆధ్యాత్మిక గురువులు లైంగికదాడుల కేసుల్లో ఉన్నారని తెలిపింది. అనుమానిత శిబిరాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. చైనా ప్రజా భద్రతా విభాగం ఈ హెచ్చరికను జారీ చేసింది. దక్షిణ భారతదేశానికి చెందిన ఓ ఆధ్యాత్మిక బృందం గురించి యీనెంగ్‌జింగ్ ఉరఫ్ ఆన్నీ యీ అనే తైవాన్ నటి సినా వెయ్‌బో (చైనా ట్విట్టర్) అనే సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టుపై దుమారం చెలరేగిన దరిమిలా చైనా ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన అమ్మభగవాన్ గురించి ఆమె ఆ పోస్టులో తెలియజేయడం గురించి చైనా నెటిజన్లు మండిపడ్డారని గ్లోబల్ టైమ్స్ పత్రిక రాసింది. చైనా యాంటీ-కల్ట్ అసోసియేషన్ (కాకా) ఆ పోస్టును పార్వర్డ్ చేసి కొన్ని మతపరమైన శిబిరాలు లైంగిక దాడుల కేసుల్లో చిక్కుకున్నాయని ప్రజలను హెచ్చరించింది. తదనంతరం తైవాన్ నటి తన పోస్టును ఉపసంహరించుకుంది. డిసెంబర్ 2017లో 200 మంది మహిళా భక్తురాళ్ల రేప్ కేసులో డేరా సచ్చాసౌదా అధిపతి గుర్మీత్‌కు శిక్ష పడడం గురించి కాకా సంస్థ గుర్తు చేసింది. సాంప్రదాయేతర మతశిబిరాల జాగ్రత్త అవసరమని చైనా మీడియాలో పలు వ్యాసాలు వస్తున్నాయి. 19వ శతాబ్దంలో జీసస్ తమ్ముడినని చెప్పుకునే ఓ మతగురువు వల్ల చైనాలో 14 స్ంవత్సరాలు అంతర్యుద్ధం వచ్చిందనీ, రెండుకోట్ల మంది ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారని ఓ పత్రిక రాసింది.

3588
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles